సిద్దిపేట టౌన్, ఫిబ్రవరి 7 : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సిద్దిపేట కాల్పుల దోపిడీ ఘటనను పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. దోపిడీకి పాల్పడింది ఇద్దరు కాదు.. నలుగురు అని నిర్ధ్దారించారు. నిందితులందరూ బంధువులే. పథకం ప్రకారమే రాబరీ.. నిందితుల వద్ద నుంచి రూ.34 లక్షల రికవరీ, కారు, మోటారు సైకిళ్లు, సెల్ఫోన్ల స్వాధీనం.. సిద్దిపేట జిల్లాలో చర్చనీయాంశంగా మారిన కాల్పుల ఘటన కేసు వివరాలను సోమవారం సిద్దిపేట పోలీసు కమిషనర్ శ్వేత మీడియా సమావేశం నిర్వహించి వివరించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. రియల్ఎస్టేట్ వ్యాపా రి వకుళాభరణం నర్సయ్య హౌసింగ్ బోర్డు కాలనీలోని తన ప్లాట్‌ను శ్రీధర్‌రెడ్డి అనే వ్యక్తికి విక్రయించాడు. జనవరి 31న రిజిస్ట్రేషన్ ఆఫీసుకు వచ్చారు. ఈ క్రమంలో శ్రీధర్‌రెడ్డి రూ.43.50 లక్షలు నర్సయ్యకు ఇచ్చాడు. రిజిస్ట్రేషన్ నిమిత్తం నర్సయ్య రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన గుర్తుతెలియని దుండగులు బైక్‌పై వచ్చి తుపాకీతో శ్రీధర్‌రెడ్డి డ్రైవర్ పరశురాములును బెదిరించారు. కారు డోర్ తీయాలని, లేదంటే చంపేస్తామని వార్నింగ్ ఇచ్చారు. భయపడ్డ డ్రైవర్ కారును ముందుకు తీసుకెళ్లే ప్రయ త్నం చేసినా, వారు అడ్డుకొని కాల్పులు జరిపారు. బ్యాగులోని నగదును అపహరించారు. ఈ కేసు ఛేదనకు ప్రత్యేకంగా 15 బృందాలు ఏర్పాటు చేసి అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. పాత నేరస్తులను విచారిస్తున్న క్రమంలో నమ్మదగిన సమాచారంతో ఎడమ సాయికుమార్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం ఒప్పుకున్నా డు. తనతో పాటు మరో ముగ్గురు ఉన్నారని, వారి పేర్లను ఆయన బహిర్గతం చేశాడని సీపీ తెలిపారు.
నేరస్తులంతా దగ్గరి వారు…
దోపిడీకి పాల్పడ్డ నేరస్తులంతా బంధువులని సిద్దిపేట సీపీ శ్వేత వివరించారు. ప్రధాన నిందితుడు గజ్జె రాజు, ఎడమ సాయికుమార్, బలిపురం కరుణాకర్ది మేడ్చల్ జిల్లా. ప్రస్తుత నివాసం బండ్లగూడ కీసర. మరో నిందితుడు బిగుళ్ల వంశీకృష్ణది సికింద్రాబాద్ అని వివరించారు. పథకం ప్రకారమే వీరంతా కలిసి సిద్దిపేట రిజిస్ట్రేషన్ ఆఫీసు వద్ద దోపిడీకి పాల్పడ్డారని వివరించారు. ప్రధాన ముద్దాయి గజ్జె రాజు, సాయికుమార్‌ది నేరచరిత్ర అని తెలిపారు. సిద్దిపేట వన్‌టౌన్ పోలీసుస్టేషన్లో 2001లో కేసు నమోదై బెయిల్‌పై బయటకు వచ్చారన్నారు. చెడు అలవాట్లకు బానిసలైన వారు, ఏదైనా క్రైమ్ చేసి డబ్బులు సంపాదించాలని పథకం పన్నారన్నారు. ఈ క్రమంలోనే రిజిస్ట్రేషన్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో సిద్దిపేట రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద క్రయవిక్రయాలు జోరుగా సాగుతాయని, అక్కడ లక్షలాది రూపాయలు చేతులుమారే అవకాశం ఉంటుందని తెలుసుకున్నారు. ఈ మేరకు రాజు, సాయికుమార్ పథకం పన్నారు. గతంలో సిరిసినగండ్లలో దొంగిలించిన పల్సర్ బైక్‌పై రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చి, చుట్టుపక్కల లావాదేవీలను గమనించారు. ఓ బ్రోకర్ ఆఫీసులో డబ్బులు లక్షల్లో లెక్కపెడుతున్న విషయాన్ని రాజు గమనించాడు. డబ్బులను బ్యాగులో పెట్టుకొని నర్సయ్యతో పాటు మరో ముగ్గురు బయటకు వచ్చారు. గమనించిన దుండగులు వెంబడించారు. కొంత సేపటికే నర్సయ్య రిజిస్ట్రేషన్ కార్యాలయానికి సంతకం పెట్టేందుకు వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన రాజు, సాయికుమార్లు డ్రైవర్ పరశురాములును వెంబడించి తుపాకీతో బెదిరించారు. డ్రైవర్ వినకపోవడంతో కాల్పులు జరిపి డబ్బుల బ్యాగుతో పరారీ అయ్యారని చెప్పారు. వీరికి కరుణాకర్, వంశీకృష్ణ సహకరించారన్నారు.
ఆధునిక టెక్నాలజీతో కేసు ఛేదన…
కాల్పుల ఘటన కేసును ఛేదించేందుకు 15 బృం దాలను ఏర్పాటు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టామని సిద్దిపేట సీపీ శ్వేత చెప్పారు. ప్రధానంగా సీపీ కెమెరాలు నిందితులను పట్టివ్వడంలో ముఖ్య భూమిక పోషించాయన్నారు. ఫింగర్ ప్రింట్ల ఆధారంగా నిందితులను గుర్తించామన్నారు. ఇన్వెస్ట్‌గేషన్ అధికారి సీఐ భిక్షపతిని, సిద్దిపేట, గజ్వేల్ ఏసీపీలను సాంకేతిక నైపుణ్యం వినియోగించిన ఐటీసెల్ ఆఫీసర్లను సీపీ శ్వేత అభినందించారు. కేసు ఛేదనలో ప్రధాన పాత్ర పోషించిన వారందరికీ రివార్డులు అందిస్తామన్నారు.
ప్రత్యేకంగా 3 బృందాల ఏర్పాటు…
తుపాకులతో కాల్చి, బెదిరింపులకు పాల్పడి దోపిడీ చేసిన నిందితులకు గన్లు ఎక్కడి నుంచి వచ్చాయి.. ఎవరు సరఫరా చేశారు.. రాష్ట్ర వ్యా ప్తంగా వీరిపైన ఏమైనా కేసులు నమోదయ్యా యా.. గన్‌తో బెదిరించి ఎక్కడైనా దోపిడీకి పాల్పడ్డారా.. ఇలా అన్ని కోణాల్లో లోతుగా పరిశోధన జరిపేందుకు ప్రత్యేకంగా 3 బృందాలను ఏర్పాటు చేస్తున్నామని సీపీ శ్వేత తెలిపారు. తుపాకులకు సంబంధించిన పూర్తి వివరాలు పరిశోధించేందుకు ఈ బృందాలు పనిచేస్తాయని, త్వరలోనే తుపాకులకు సంబంధించిన సమాచారం తెలియజేస్తామన్నారు. గన్ కల్చర్‌పై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నామని చెప్పారు. సీసీ కెమెరాలను మరిన్ని బిగిస్తామని, పనిచేయని సీసీ కెమెరాలపై దృష్టిసారిస్తామని చెప్పారు. నిందితుల వద్ద నుంచి సొత్తు రికవరీ చేసి కోర్టుకు హాజరుపర్చామన్నారు. సమావేశంలో అడిషినల్ డీసీపీ మహేందర్, సిద్దిపేట ఏసీపీ దేవారెడ్డి, గజ్వేల్ ఏసీపీ, వన్‌టౌన్ సీఐ భిక్షపతి, పోలీసులు పాల్గొన్నారు.