
చేర్యాల, జనవరి 28 : విద్యాబుద్ధులు నేర్పి తన ఎదుగుదలకు కారణమైన బడి అభివృద్ధికి ఎన్ఆర్ఐ పెడుతల ప్రతాప్‌రెడ్డి ఇతోధికంగా సాయమందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ముస్త్యాల గ్రామానికి చెందిన పెడుతల ప్రతాప్‌రెడ్డి 2004 సంవత్సరం నుంచి గ్రామంలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల అభివృద్ధికి తనవంతుగా చేయూతనిస్తున్నాడు. విద్యార్థులకు వసతులు కల్పించేందుకు ఏటా లక్షలాది రూపాయలు బడులకు ఖర్చుచేస్తున్నాడు. చిన్ననాడు చదువుకున్న బడి, పుట్టినఊరు, కన్న వారిని మర్చిపోతున్న ఈ రోజుల్లో 18 ఏండ్లుగా పాఠశాల అభివృద్ధి కోసం కృషిచేస్తున్న ప్రతాప్‌రెడ్డిని పలువురు ప్రశంసిస్తున్నారు. పాఠశాల అభివృద్ధికి ఎన్ఆర్ఐ చేయూతనిస్తుండగా, ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తున్నారు.
చదువులమ్మ చెట్టు నీడని మరువని వైనం..
ముస్త్యాల పాఠశాలలో ప్రతాప్‌రెడ్డి విద్యనభ్యసించి ప్రస్తు తం అమెరికాలోని న్యూ జెర్సీ ఫిలిమింగ్టన్లో స్థిరపడ్డారు. గ్రామంలోని ఉన్నత పాఠశాలలో వసతుల కోసం రూ.7లక్షలు, ప్రాథమిక పాఠశాల వసతులు తదితర ఖర్చుల కోసం రూ.3 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఈ డిపాజిట్ల ద్వారా వచ్చిన వడ్డీ డబ్బులతో పాఠశాలలో వసతులు కల్పించడంతో పాటు విద్యార్థ్ధులను ప్రోత్సహిస్తున్నారు. ప్రతాప్‌రెడ్డి ఇంగ్లిష్ మీడియం సైతం విద్యార్థులకు బోధించాలని, కంప్యూటర్ పరిజ్ఞానం పెంపొందించాలని సూచించారు. దీనికి అనుగుణంగా ఉపాధ్యాయకులు సైతం ప్రత్యేకం ఇన్స్ట్రక్టర్లను నియమించి విద్యార్థులకు కంప్యూటర్ విద్యపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వంతో పాటు ఎన్ఆర్ఐ పాఠశాల అభివృద్ధి, వసతులు కల్పిస్తుండడంతో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. ముస్త్యాల ఉన్నత పాఠశాలకు పలు గ్రామాల నుంచి విద్యార్థులు వచ్చి విద్యను అభ్యసిస్తున్నారు.
ప్రభుత్వ నిర్ణయంతో సర్కారు బడులకు మహర్దశ..
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం కోసం సీఎం కేసీఆర్ ‘మన ఊరు-మనబడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంతో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి. తెలుగు మీడిమానికి ప్రాధాన్యత ఇస్తూనే ఇంగ్లిష్ మీడియం ప్రారంభించడం మంచి పరిణామం. ఇప్పటికే ప్రభుత్వం గురుకులాల్లో కార్పొరేట్ విద్యను అందిస్తున్నది. ఇప్పుడు జిల్లా, మండల పరిషత్ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగవుతాయి. తల్లిదండ్రుల్లో పభుత్వ విద్యపై నమ్మకం పెరిగి తమ పిల్లలను సర్కారు బడులకే పంపుతారు.
-రమణారెడ్డి, విశ్రాంత హెచ్ఎం శివ్వంపేట, మెదక్ జిల్లా
ప్రభుత్వానిది గొప్ప నిర్ణయం..
రాష్ట్ర ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం మహాగొప్ప నిర్ణయం. ఇంగ్లిష్ భాష పేరుతో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ప్రజలను దోపిడీకి గురిచేస్తున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ నిర్ణయాలు, కోర్టుల తీర్పులు, టెక్నాలజీ ఇంగ్లిష్‌లో ఉంటుంది. ప్రపంచీకరణలో భాగంగా ఉద్యోగాలు, టెక్నాలజీని అందిపుచ్చుకోవాలంటే తప్పనిసరిగా ఇంగ్లిష్ రావాల్సి ఉంటుంది. ఇలాంటి తరుణంలో ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయం. తెలుగు మీడియం విద్యార్థులు ఉన్నత చదువులో భాగంగా ఇంగ్లిష్ మీడియానికి వెళ్లి ఎంతో మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. పిల్లల కెరీర్ పెంచుకోవడం కోసం ఇంగ్లిష్ చాలా అవసరం. ఉపాధ్యాయులను ఇంగ్లిష్ మీడియానికి సంసిద్ధులను చేయాలి. ప్రభుత్వం తగిన వాతావరణం కల్పించాలి. మనకు మాతృ భాష కూడా చాలా అవసరం. దానికి తోడు ఇంగ్లిష్ ఇంకా అవసరం. మాతృ భాష కన్నులాంటిది..ఇంగ్లిష్ భాష కండ్ల అద్దాలలాంటిది.
హర్షించదగ్గ విషయం..
ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం హర్షించదగ్గ విషయం. పేద కుటుంబాల విద్యార్థులు ఆంగ్ల విద్యతో ఉన్నతస్థాయికి చేరుకోవడానికి అవకాశాలు లభిస్తాయి. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది. దీని ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం తప్పుతుంది. ప్రభుత్వ పాఠశాలలు పూర్వవైభవం సంతరించుకుంటాయి.
-రాములు, పాథమికోన్నత పాఠశాల నాగులపల్లి హెచ్ఎం, వట్పల్లి
నిరుపేదలకు వరం..
‘మనఊరు-మనబడి’ కార్యక్రమం నిరుపేద విద్యార్థులకు వరం. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం ద్వారా నిరుపేద విద్యార్థులు భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించడం సంతోషకరం. ప్రభు త్వ పాఠశాలలు బలోపేతమైతే పేదలు, మధ్య తరగతి కుటుంబాల పిల్లలకు మేలు జరుగుతుంది.
-సంధ్య, పాథమికోన్నత పాఠశాల పాలడుగు హెచ్ఎం, వట్పల్లి
మంచి ఆలోచన..
‘మన ఊరు-మనబడి’ కార్యక్రమం చాలా ఉత్తమమైంది. విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను ఆంగ్లం మాధ్యమంలో చదివించాలని కోరుకుంటారు. అం దరి ఆర్థిక పరిస్థితులు ఒకే లా ఉండవు. తమ పిల్లలకు మంచి భవిష్యత్ అందించాలని వేల రూపాయలు ఖర్చుచేస్తూ ప్రైవేట్‌లో చదివిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల విద్య అందుబాటులోకి వస్తే తల్లిదండ్రులకు ఆర్థిక భారం తప్పుతుంది.
-శ్రీదేవి, ఉపాధ్యాయురాలు,పాథమికోన్నత పాఠశాల వట్పల్లి
లక్షలాది రూపాయలతో సౌకర్యాల కల్పన…
ముస్త్యాల పాఠశాలలో అసంపూర్తిగా ఉన్న గదులు, పాతబావి పూడ్చడం, ప్రహరీ నిర్మాణం, బెంచీల ఏర్పాటు తదితర వాటి కోసం ఇప్పటి వరకు ప్రతాప్‌రెడ్డి రూ.30లక్షల వరకు ఖర్చు చేసినట్లు ఎన్ఆర్ఐ బంధువు, గ్రామ సర్పంచ్ పెడుతల ఎల్లారెడ్డి తెలిపారు. ఉన్నత పాఠశాలలో అసంపూర్తిగా ఉన్న రెండు గదులను రూ.4లక్షల వ్యయంతో పూర్తి చేయించారు. మరో రెండు తరగతి గదులు, రేకులు తదితర వాటిని రూ.2.50 లక్షలతో పూర్తి చేయించారు. రూ.4 లక్షలతో సైన్స్ ల్యాబ్‌ను నిర్మించారు. రూ.6లక్షలతో ప్రాథమిక పాఠశాలకు ప్రహరీని నిర్మించారు. పాత బావి పూడ్చివేసేందుకు రూ.25 వేలు, బెంచీల కోసం రూ.50 వేలు, గ్రంథాలయం కోసం రూ.80 వేలు వెచ్చించారు. ఉన్నత పాఠశాలకు రూ.7 లక్షలు, ప్రాథమిక పాఠశాలకు రూ.3లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. చదువులో ప్రతిభ చూపుతున్న విద్యార్థులను నగదు బహుమతులు అందజేస్తున్నారు.