నారాయణరావుపేట, నవంబర్ 14 : తాము పండించే పంటల విత్తనాల కోసం ఎక్కడెక్కడికో వెళ్లకుండా క్లస్టర్ స్థాయిలోనే రైతులకు అందజేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు పిలుపు మేరకు నారాయణరావు పేటలోని రైతు వేదికలో సీడ్ బ్యాంక్ ద్వారా విత్తనాలు అందించే నూతన ఒరవడికి అధికారులు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా నారాయణరావుపేట, ఇబ్రహీంపూర్, బంజేరుపల్లి, లక్ష్మీదేవిపల్లి, కోదండరావుపల్లి గ్రామాల్లోని రైతులు తాము పండించిన పంటలో మేలిమి విత్తనాలను సేకరించి సీడ్ బ్యాంక్‌లో భద్రపరిచారు. ప్రస్తుతం 42 రకాల విత్తనాలను సీడ్ బ్యాంకు ద్వారా రైతుల కోసం అందుబాటులో ఉంచారు వ్యవసాయశాఖ అధికారులు.
విత్తనాభివృద్ధిపై అవగాహన
మండల పరిధిలోని రైతువేదికలో తమ క్లస్టర్ పరిధిలోని రైతులకు విత్తనాభివృద్ధిపై వ్యవసాయ శాఖ అధికారులు, ఏఈవో నాగార్జున ఆధ్వర్యంలో అవగాహన కల్పించి విత్తన ఉత్పత్తి చేయించారు. రైతులు పండించిన విత్తనాలతో పాటు వివిధ రకాల విత్తనాలను కూడా సీడ్ బ్యాంకులో పొందుపరిచారు. ఈ పద్ధతితో ఒక రైతు నుంచి మరొక రైతు సీడ్ బ్యాంకు ద్వారా విత్తనాలను తీసుకోగలుగుతారు. ఏ రైతు ఏ విత్తనాలను పండిస్తున్నారు అనే వివరాలను రైతువేదికలో అందుబాటులో ఉంచనున్నారు.
వర్మీకంపోస్టు తయారీపై అవగాహన
వర్మీకం పోస్టు ఎరువు ఎలా తయారవుతుందనే అంశంపై రైతు వేదికలో అవగాహన కల్పించారు. తయారు చేసిన ఎరు వు ఏ పంటకు ఏ విధంగా వాడుకోవాలో ఏఈవో నాగార్జున రైతులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రత్యక్షంగా వివరించడమే కాకుండా నోటీసు బోర్డుపై పోస్టర్ల రూపంలో తెలియజేస్తున్నారు. అలాగే, వానపాములు సేకరించి వాటితో ఎరువు ఎలా తయారు చేయాలో చెప్పేందుకు వర్మీకంపోస్టు నమూనాను రైతు వేదికలో ఏర్పాటు చేశారు.
42 రకాల విత్తనాలు..
సీడ్ బ్యాంక్‌లో మొత్తం 42 రకాల విత్తనాలు రైతుల కోసం సిద్ధంగా ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా.. కాలబట్టి, మైసూర్ మాలిక, రతనచొడి, ఇలపుసంబ, బాస్భోగ్, నవర, చింతలూరి సన్నాలు, కుల్లకర్, దస్మతి, కుజిపటియల్లి, రెడ్ జాస్మిన్, మాల్ సుందరి, కాకి రేకలు, బర్మాబ్లాక్, మణిపూర్ బ్లాక్, సన్నజాజులు, దాడిగా, రవికంద.. వివిధ రకాల దేశవాళి వరి వంగడాలు, కందిలో డబ్ల్యూఆర్‌జీ 93, డబ్ల్యూఆర్‌జీ 97, డబ్ల్యూఆర్‌జీ 65, డబ్ల్యూఆర్‌జీ 121, పెసరులో డబ్ల్యూజీజీ 42, డబ్ల్యూజీజీ 37 వంటి వివిధ రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయి.
రైతులకు లాభం చేకూర్చడమే లక్ష్యం
నా క్లస్టర్ పరిధిలోని రైతులకు సీడ్ బ్యాంకు గురించి అవగాహన కల్పిస్తున్నాం. వివిధ రకాల దేశీ వరి వంగడాలతో పాటు ఇతర పంటలు ఏ విధంగా సాగు చేయాలో నిత్యం వివరిస్తున్నాం. వానపాములను సేకరించి వర్మీకంపోస్టును ఎట్లా సిద్ధం చేయాలో తెలియజేస్తున్నాం. తమ పొలంలోనే ఎరువులు తయారు చేసుకొని తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు సాధించొచ్చని సూచిస్తున్నాం.
-నాగార్జున (ఏఈవో నారాయణరావుపేట క్లస్టర్)