
సిద్దిపేట, జూన్ 29 : పేదల ప్రజల కడుపు నింపేందుకు లయన్స్ క్లబ్ ప్రవేశపెట్టిన రైస్బ్యాంకు ఎంతగానో దోహదం చేస్తున్నదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మంగళవారం సిద్దిపేట లయన్స్ క్లబ్లో రైస్బ్యాంకు, ఆక్సిజన్ బ్యాంకులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కాలంలో ఉపాధి కోల్పోయిన ఎంతో మంది కార్మికులకు, నిరుపేదలకు రైస్బ్యాంకు ఆకలి తీర్చేందుకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు. కరోనాతో దవాఖాన నుంచి డిశ్చార్జ్ అయిన తరువాత ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఉపయోగపడుతాయన్నారు. పేదలకు ఉచితంగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను అందించడం పట్ల లయన్స్ క్లబ్ నిర్వాహకులను అభినందించారు.
అవసరమున్న వారు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సిద్దిపేట జిల్లాలో జిల్లా దవాఖానలో ఆక్సిజన్ ప్లాంట్‌తో పాటు ఆక్సిజన్ నిల్వ బ్యాంకు ఏర్పాటు చేశామన్నారు. స్వచ్ఛంద సంస్థల నుంచి విరాళాల రూపేనా వచ్చిన ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను మెడికల్ కళాశాల దవాఖానకి అప్పగించామన్నారు. సిద్దిపేట మున్సిపల్ చైర్‌పర్సన్‌తో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్‌ను జిల్లా దవాఖాన, మెడికల్ కళాశాల దవాఖానను సందర్శించినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకుంటున్నారా?, లేదా? అని పర్యవేక్షించాలన్నారు. లయన్స్ క్లబ్ సేవా భావానికి పెట్టింది పేరని, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు విస్తరించాలన్నారు. లయన్స్ క్లబ్ చేపట్టే కార్యక్రమాలకు సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు వినోద్ మోదానీని అభినందించారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరాం, లయన్స్ క్లబ్ ప్రతినిధులు ఈశ్వరయ్య, కొమురవెల్లి శేఖర్, బాలకిషన్, జోజి, చంద్రశేఖర్, సుభాశ్, సిద్ధులు, రవి, సురేందర్, గోపాల్, సత్యనారాయణ, రఘు, పాండురంగం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.