సిద్దిపేట కమాన్/ ప్రశాంత్‌నగర్/ కొండపాక, నవంబర్ 3 : ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో వ్యాయామం తప్పనిసరి అన్నట్లుగా మారింది పరిస్థితి. ప్రతిరోజు నడక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అందరికీ తెలిసిందే కానీ, ఎందుకు ప్రత్యేకంగా సమయం కేటాయించడంలో చాలా మంది విఫలమవుతుంటారు. ప్రతి రోజు నడవడం మంచిదని వైద్యులు పదేపదే చెబుతుంటారు. ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే నడకతో పాటు తేలికపాటి వ్యాయామం అవసరం. నడకతో ఎన్నో ఉపయోగాలున్నాయి. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంచుకోవాలంటే, ఎక్కువ కాలం బతకాలంటే రోగనిరోధక శక్తి పెంచుకోవాలి. అంటే వ్యాయామంతో పాటు ఆహార, ఆరోగ్య నియమాలు పాటించాలి. గంటల కొద్ది బాతాకాని కొడుతూ సమయాన్ని వృథా చేసే బదులు, ఒక్క అరగంట నడిస్తే చాలు చక్కని ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. నడకతో కలిగే ప్రయోజనాలను తెలుసుకుంటే తప్పని సరిగా ఉత్సహంగా నడుస్తూ.. ఆరోగ్యవంతులుగా ఉంటారు.
నిధానంగా నడిస్తే..
మనం నిధానంగా నడవడంతో 15 నిమిషాల్లో 9 కేలరీలు ఖర్చు అవుతాయి. 30 నిమిషాల్లో 25 కేలరీలు ఖర్చు చేయవచ్చు. కాస్త సాధారణం కంటే కొంత వేగంతో నడిస్తే 15 నిమిషాల్లో 25 కేలరీలు ఖర్చు అవుతుంది. అలాగే అరగంటలో 50కి పైగా కేలరీలు ఖర్చు అవుతాయి. స్పీడ్ వాకింగ్, జాగింగ్, రన్నింగ్ చేస్తే మనం అనుకున్నంత ఫలితాన్ని పొందవచ్చంటున్నారు. ఆరోగ్య నిపుణులు. కేవలం అరగంటలో 250 కేలరీలు ఖర్చువుతాయి. నడిచే దూరాన్ని బట్టి కూడా కేలరీలు ఖర్చువడం జరుగుతుంది. కొంతమం ది ఒక మైలుతో మొదలు పెట్టి రెండు నుంచి నాలుగు మైళ్లవరకు వాకింగ్ చేస్తుంటారు.
వాకింగ్ ఎలా చేయాలి
వాకింగ్ మొదలు ప్రారంభించగానే గంటలు నడవకుండా శరీరం అలవాటు పడేలా సమయాన్ని పెంచుతూ ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఒకేసారి అరగంట కాకుండా ముందు పావుగంట పాటు నడవాలి. ఆ తర్వాత అరగంట ఆపైన పెంచుతూపోవాలి. మొదట అరగంటలో ఒక మైలు నడిస్తే చాలని సూచిస్తున్నారు. ఆ తర్వాత ఒక మైలు దూరాన్ని పావుగంటలో నడిచేంత వేగం వరకు ప్రయత్నించవచ్చు. వేగం పెంచుతున్న కొద్దీ శరీరంలో శక్తి స్థాయి మెటబాలిజం పెరుగుతుంటుంది. వారం పాటు ప్రతిరోజు నడవడంతో అత్యధికంగా 1500 కేలరీల వరకు ఖర్చు అవుతుంది. వాకింగ్ అప్పుడే మొదలు పెట్టినవారికి ఇది మంచి ఫలితం ఇస్తుంది. అయితే ఒకసారి వాకింగ్ మొదలు పెట్టాక దాన్ని ఆపకుండా చేస్తుండటం మంచిది. అప్పుడే సరైన ఫలితం కనబడుతుందని నిపుణులు చెబుతున్నారు.
బరువు తగ్గాలంటే ఎంత సేపు నడవాలి..
బరువు తగ్గాలనుకునేవారు రోజుకు అరగంట పాటు నడవాలి. అలా నడుస్తున్న కొద్ది రెండు నెలల్లో బరువు అనేది తగ్గడం మొదలవుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే తప్పని సరిగా ఆ నడక వేగంగా ఉండాలి. కొంతమంది ఒక వారం రెండు వారాలు నడిచి ఇంకా బరువు తగ్గడం లేదని నిరాశపడి వాకింగ్ చేయడం మానేస్తుంటారు. అలా ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. శరీరంలో పేరుకున్న కొవ్వు కరగాలంటే కొంత సమయం పడుతుంది. ఓపికతో క్రమం తప్పకుండా వాకింగ్ చేస్తుండాలి. తర్వాత మనం అనుకున్న ఫలితం ఉంటుంది.
రివర్స్ నడవడం వలన..
వాకింగ్ చేసేవారు మలుపుల్లో నడిస్తే ఇంకా మంచిదంటున్నారు నిపుణులు. నడిచేటప్పుడు నేరుగా ఉన్న రోడ్డు మీద కాకుండా వెనక్కు నడిస్తే మరింత ఎక్కువగా కేలరీలు ఖర్చువుతాయట. అలాగే ముందుకు కాకుండా వెనక్కి నడిస్తే మరింత మంచి ఫలితాన్ని పొందవచ్చు. వెనక్కు నడిస్తే మన గుండె వేగం మరింత మేలు జరుగుతుందని చెబుతున్నారు. అలాగే ఎక్కువ కేలరీలు సైతం ఖర్చవుతాయి. వెనుక నుంచి వాహనాలు రావనే నమ్మకం ఉన్న ప్రదేశాల్లో కొంత సమయం ఇలా నడపవచ్చు.
నడకతో గుండె పదిలం..
ప్రతి రోజు వాకింగ్ చేయడంతో డయాబెటిస్ ఉన్న వారికి మరీ మంచిది. ప్రతి రోజు క్రమం తప్పకుండా వాకింగ్ చేస్తే షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది. అలాగే గుండె జబ్బులున్న వారికి ఎంతో మేలు అని వైద్య నిపుణులు చెబుతున్నారు. వాకింగ్ అనేది ఒక్క బరువు తగ్గడానికే కాకుండా ఎన్నో వ్యాధులను దూరం చేస్తుంది. శరీరం హుషారుగా ఉంటుంది. క్రమం తప్పకుండా వాకింగ్ చేసేవారు
చురుకుగా ఉంటారు.
ఆహార విషయంలో అప్రమత్తంగా ఉండాలి
ఎక్కువ మంది బరువు త్వరగా తగ్గాలనే ఉద్దేశంతో వాకింగ్ చేస్తుంటారు. వేగంగా నడుస్తుంటారు. అలాంటి వారు ఆహార విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. చాలా కఠినమైన నియమాలు పెట్టుకొని వాకింగ్ చేస్తున్నా.. తిండి ఆపకపోతే వారు అనుకున్న ఫలితాన్ని సాధించలేరు. వాకింగ్ చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదు. మరీ ముఖ్యంగా కొంతమంది అవసరం లేకపోయినా అదే పనిగా ఏదో ఒకటి తింటూ ఉంటారు. వీరు ఎక్కువగా జంక్ ఫుడ్‌నే తింటారు. ఇలాంటి వారు ఎంత వాకింగ్ చేసినా బరువు తగ్గటం ఉండదు. ఆహారాన్ని అదుపులో పెట్టుకోకపోతే శ్రమంతా వృథా అవుతుంది. వాకింగ్ చేసినా.. బరువు తగ్గాలనుకున్నా.. ఆహార నియమాలు తప్పకుండా పాటిం చాలి.
సిద్దిపేటలో నలుదిక్కులా..
సిద్దిపేట నలుదిక్కులా చా లా అభివృద్ధి జరిగింది. రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రత్యేకంగా వాకింగ్ చేసే వారి కోసం ప్లాట్పామ్స్ నిర్మింపజేశారు. పట్టణం చుట్టూ రింగురోడ్డుతో పాటు హైదరాబాద్ రోడ్డు – మెదక్ రోడ్డు – కరీంనగర్ రోడ్డు – హన్మకొండ రోడ్డుల్లో వాకర్స్‌కు పచ్చని చెట్ల మధ్య వాతావరణం అనుకూలంగా ఉన్నది. రోజూ ఉదయం పట్టణ ప్రజలు ఈ దారుల్లో నడకను కొనసాగిస్తున్నారు. చిన్నారులు, పెద్దలు, కుటుంబ సమేతంగా వాకింగ్ చేస్తున్నారు. అలాగే పట్టణంలోని కోమటి చెరువు, చింతల్, ఎర్రచెరువు తదితర వాటిని అభివృద్ధి పర్చడంతో వాకింగ్ చేయడానికి అనువుగా మారింది. చెరువు కట్టలపై దారిని విశాలంగా చేయడంతో పాటు కట్టకు ఇరువైపులా గ్రిల్స్, లైటింగ్ ఏర్పాటు, చెట్లు పెంచడంతో ఉదయమే వందలాది మంది వాకర్స్ నడకను చేపడుతున్నారు. చెరువు కట్టలపై, పట్టణ ప్రధాన దారుల్లో జిమ్‌లు ఏర్పాటు చేయడంతో వాటిపై కసరత్తు చేస్తూ ఆరోగ్య సూత్రాలు పాటిస్తున్నారు. ప్రతి ఒక్కరూ వాకింగ్ చేస్తే ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవచ్చు.
వాకింగ్‌తో ఆరోగ్యం.. ఫిట్నెస్
ప్రతి రోజూ వాకింగ్ చేయడం అలవాటైపోయింది. ఉదయమే లేచి వాకింగ్ చేయడంతో రోజంతా ఎంతో ఉత్సాహంగా అనిపిస్తోంది. రోజువారి పనులు చకచకా అయిపోతాయి. వాకింగ్ చేయడంతో శరీరంలోని అన్ని భాగాలు కదలికలు వచ్చి ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండగలుగుతాం. యువత.. అందరూ రోజూ వాకింగ్ చేయడం అలవాటు చేసుకోవాలి.
– రవికుమార్ (అడ్వకేట్, సిద్దిపేట)
పచ్చని చెట్ల మధ్యన రోజూ నడక..
పొద్దున్నే కాలిసమయం బాగా దొరుకుతుంది. ఈ సమయంలో ఐదారు మంది కలిసి రోజు నడుస్తాం. సిద్దిపేట పక్కన వడ్ల మార్కెట్ వెళ్లే రోడ్డులో నడకను ప్రారంభిస్తాం. ఇక్కడ అనుకూలంగా రోడ్డు విశాలంగా ఉండడంతో పాటు పచ్చని చెట్లు ఉన్నాయి. మంచి గాలి వీస్తుంది. నాతో పాటు చాలా మంది ఇక్కడకు వస్తారు. అనారోగ్యం బారిన పడకుండా ఉండాలంటే నడకే మంచిది.
– సమ్మవ్వ (సిద్దిపేట)
వాకింగ్‌తో సంపూర్ణ ఆరోగ్యం
వాకింగ్..నడక ఇది ప్రతి ఒక్కరికీ తప్పని సరి కాబోతోంది. ఉదయం లేచిన దగ్గరి నుంచి ఉరుకులు.. పరుగుల జీవితం. క్షణం తీరిక లేని సమయం.. అయినప్పటికీ నడక తప్పనిసరి చేస్తేనే సంపూర్ణ ఆరోగ్యం సిద్దిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే గుండె జబ్బులు ఉన్నవారు వాకింగ్ చేససేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎమర్జెన్సీ ఫోన్ నంబర్లను దగ్గర పెట్టుకోవాలి. వాకింగ్ చేస్తే గుండె కొట్టుకునే వేగం పెరగాలి. చెమట పట్టేటట్లు చేయాలి. ఇలా వాకింగ్ చేస్తే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. సిద్దిపేటలో కోమటిచెరువు కట్టపైన రూబీ నెక్లెస్‌రోడ్డులో ప్రతి రోజూ వందలాది మంది వాకింగ్ చేస్తున్నారు.