సిద్దిపేట ప్రతినిధి, జూన్ 9 (నమస్తే తెలంగాణ) : కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడంలో చేతులెత్తేసింది. దీంతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగవద్దనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి ప్రతి గింజాను కొనుగోలు చేస్తున్నది. దీంతోపాటు రైతుల ఖాతాల్లో నేరుగా ధాన్యం డబ్బులను జమ చేస్తున్నది. నెల రోజులుగా గ్రామాల్లో కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో 413 కేంద్రాలను ఏర్పాటు చేసి చేసింది. ఇప్పటి వరకు రూ.563.43 కోట్ల ధాన్యాన్ని 64,034 మంది రైతుల నుంచి కొనుగోలు చేసింది. రూ.300 కోట్లు రైతుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. ఇప్పటి వరకు జిల్లాలో (బుధవారం వరకు) 79 కేంద్రాలను మూసి వేసింది. రైతులకు ఇబ్బంది కలుగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. మృగశిర కార్తె రావడంతో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. దీంతో త్వరితగతిన రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు పూర్తి చేసి కేంద్రాలను మూసి వేయనున్నారు.
రాబోయే నాలుగైదు రోజుల్లో అన్నికేంద్రాల్లో ధాన్యం పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేశారు. ఎప్పటికప్పుడు మంత్రి హరీశ్‌రావు అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. మంత్రి ఆదేశాలతో కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్లు ముజామ్మిల్‌ఖాన్, శ్రీనివాస్‌రెడ్డి, ఇతర జిల్లా అధికారులు ఆయా మండలాల్లో కేంద్రాలను సందర్శించి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయడమేగాక వెంటనే రైస్ మిల్లులకు తరలిస్తున్నారు. అవసరమైన మేరకు తాత్కాలికంగా ఖాళీగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ భవనాల్లో ధాన్యాన్ని నిల్వ చేస్తున్నారు. వర్షాలకు ధాన్యం తడవకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. గ్రామాల్లో ధాన్యం కొనుగోళ్లు జోరుగా కొనసాగుతున్నాయి. రైతు పండించిన ప్రతి గింజాను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది. ఇటీవల అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయాలని అధికార యంత్రాంగాన్ని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో కొనుగోలు చేశారు
జిల్లాలో రూ.563.43 కోట్ల ధాన్యం కొనుగోలు
జిల్లావ్యాప్తంగా ధాన్యం కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేశారు. నలుగైదు రోజుల్లో ధాన్యం కొనుగోలు పూర్తి కానున్నది. రైతుల ముంగిట కొనుగోలు కేంద్రాలు ఉండడంతో పొలం నుంచి కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ధాన్యాన్ని అమ్ముకున్నారు. ఈ యాసంగిలో జిల్లాలో 2,62,277 ఎకరాల వరి సాగు చేశారు. 6,55,692 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. కొన్న ధాన్యం స్థానిక అవసరాలకు గాను 55,962 మెట్రిక్ టన్నుల ధాన్యం పోను మిగిలిన 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామాల్లో ధాన్యం కేంద్రాలను ఏర్పాటు చేసి ముమ్మరంగా కొనుగోలు చేస్తున్నది. జిల్లాలో 413 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించగా, బుధవారం వరకు 79 కేంద్రాలను మూసి వేశారు. వీటిలో మహిళా సంఘాల ద్వారా 36, సహకార సంఘాల ద్వారా 42, మార్కెట్ కమిటీల ద్వారా 01 మూసి వేసిన వాటిలో ఉన్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు 3,50,243 మెట్రిక్ టన్నుల ధాన్యం రాగా, 2,87,464 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి మిల్లులకు తరలించారు. 64,034 మంది రైతుల వద్ద నుంచి రూ.563. 42 కోట్ల విలువ చేసే ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇందులో 32,771 మంది రైతులకు గాను రూ.300.51 కోట్లు వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులను జమ చేసింది. ట్యాబ్ ఎంట్రీ చూసినైట్లెతే రూ.484.65 కోట్లు మేర చేశారు. రూ.78.78 కోట్లు పెండింగ్ ఉండగా, దీనిని త్వరగా పూర్తి చేసేలా అధికారులు కృషి చేస్తున్నారు. మొత్తంగా ట్యాబ్ ఎంట్రీ 86 శాతం పూర్తయింది. సేకరించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు లారీల్లో లోడింగ్ చేసి మిల్లులు, గోదాములకు తరలిస్తున్నారు.
మూడు రోజుల్లో చేతికి డబ్బులు
సీఎం కేసీఆర్ రైతుల పాలిట దేవుడు. యాసంగి వడ్లను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకున్నా.. రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయడం సంతోషం. కేంద్రాల్లో ఇబ్బందులు లేకుండా వేగవంతంగా ధాన్యం కొనుగోలు చేశారు. నాలుగెకరాల్లో వరి సాగుచేశాను. 180 క్వింటాళ్ల వడ్లను ఐకేపీ కేంద్రంలో మూడు దఫాలుగా విక్రయించా. మూడు రోజుల్లో బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. మొత్తం రూ.2.64 లక్షలు చేతికి వచ్చాయి.
-బట్టు రాజిరెడ్డి, హబ్షీపూర్, దుబ్బాక
వేగంగా కొనుగోళ్లు, చెల్లింపులు
గజ్వేల్ మార్కెట్ కమిటీలో పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేం ద్రంలో 498 మంది రైతుల నుంచి రూ.4,23,01,856 విలువ గల 21633 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశాం. 384 మంది రైతుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేసి రూ.3,31,15,424 డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేశాం. మిగతా ధాన్యానికి సంబంధించిన వివరాలను సిబ్బంది ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు.
-జాన్‌వెస్లీ, ఏఎంసీ కార్యదర్శి గజ్వేల్
సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు
సీఎం కేసీఆర్ సారు కాళేశ్వరం తో నీళ్లు పారియ్యంగనే మా బోర్లల్ల నీళ్లు మస్తుగొచ్చినాయి. పొద్దుమాపు కరెంటు ఉండే. అందుకే ఎకరంన్నర పొలంలో వరి పండిచ్చిన. మస్తుగ పండింది. బీజేపీ సర్కారోళ్లు బియ్యం కొనమని చెప్పినకాడి నుంచి బాగా రంది పడ్డం. పండిచ్చిన పంట అమ్ముడు పోతదోనని మస్తు సోచాయించినం. సీఎం కేసీఆర్ ధాన్యం మొత్తం కొంటమని జెప్పుడుతోటి మస్తు ఖుషీ అయినం. 62 క్వింటాళ్లు అమ్మిన. లక్ష 22వేల 304 రూపాయలు బ్యాంకు ఖాతాల్లో జమ చేసినారు. సీఎం కేసీఆర్ రైతుల కోసం గిట్లనే పాలన చెయ్యాలే.
-మల్లారెడ్డి, రైతు, సంగుపల్లి
అమ్మిన వెంటనే పైసలు ఖాతాల్లో పడ్డాయి
నా పేరు నునావత్ సునీత. మా ది అక్కన్నపేటలోని చౌడుతండా. మాకు మూడెకరాల భూమి ఉంది. నాటు వేస్తే దగ్గర దగ్గర 250 బస్తా లు (45కిలోల సంచులు) వడ్లుయితే సొసైటీలో కాంటా పెట్టిన. పండించిన వడ్లకు కూడా మద్దతు ధర మంచిగా ఉన్నది. పోయిన వానకాలంతో పోల్చితే రేటు కూడా రూ.100వరకు పెంచి సీఎం కేసీఆర్ వడ్లు కొన్నరు. వడ్లు అమ్మిన వెంటనే సుమారు రూ.2లక్షలు ఖాతాల్లో పడ్డాం.
-నునావత్ సునీత, మహిళా రైతు, అక్కన్నపేట
13,928 క్వింటాళ్లు కొన్నం
అక్కన్నపేట మండలంలో పీఏసీఎస్, ఐకేపీ ఆధ్వర్యంలో 28 ధాన్యం కొనుగోలు సెంటర్లు ఏర్పా టు చేశారు. ఈ ఏడాది యాసంగిలో అత్యధికంగా అక్కన్నపేటలోని పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు చేశాం. 345 మంది రైతుల నుంచి 34,820 సంచుల ద్వారా 13,928 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశాం. వారం రోజుల కిందట కొనుగోలు కేంద్రాన్ని మూసివేశాం. రైతులకు కూడా పూర్తి స్థాయిలో ధాన్యం డబ్బులు చెల్లించాం.
కాశబోయిన రాజు,పీఏసీఎస్ సెంటర్ నిర్వాహకుడు, అక్కన్నపేట
వారం రోజులకు పైసలు వచ్చినయి
ఐదెకరాల్లో వరి సాగు చేశాను. 134 క్వింటాళ్ల ధాన్యం పండింది. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో అమ్మితే వారం రోజుల్లో డబ్బులు పడ్డాయి. 337 బ్యాగుల వడ్ల అమ్మి తే రూ.2,62,640 వచ్చినయి. వడ్లు అమ్మిన వెంటనే సిబ్బంది కొనుగోలు ప్రాసెస్ పూర్తి చేయగానే డబ్బులు వచ్చినయి.
-కర్రె శ్రీనివాస్‌రెడ్డి(రైతు, ఆకునూరు, చేర్యాల)