సిద్దిపేట, జూన్ 9 : అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్లుగా బీజేపీ నేతలు మారారని, కాంగ్రెస్‌వి పగటి కలలు అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. గురువారం హైదరాబాద్‌లోని తన నివాసంలో సిద్దిపేట పట్టణానికి చెందిన బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దరిపల్లి శ్రీను, బీజేపీ పట్టణ మైనార్టీ అధ్యక్షుడు ఇబ్రహీం, కాంగ్రెస్ నాయకులు కృష్ణపురం బాబుతో పాటు 100 మంది మంత్రి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రెండు జాతీయ పార్టీలు తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయన్నారు. నాడు సమైక్య పాలనలో కాంగ్రెస్ అన్యాయం చేస్తే.. నేడు స్వరాష్ట్రంలో కేంద్రంలోని బీజేపీ తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయన్నారు. మన పథకాలు కాపీ కొట్టి మేమే చేశామని అబద్ధాలు ఆడుతూ, ఫేక్ సోషల్ మీడియా ప్రచారం చేస్తున్నారన్నారు.
బీజేపీ ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు విశ్వసించరన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ కనుమరుగైన పార్టీ అని, కాంగ్రెస్ నేతలవి పగటి కలలు అన్నారు. తెలంగాణ ప్రజల గుండె చప్పుడు, ప్రజల ఇంటి పార్టీ టీఆర్ఎస్ అని, సీఎం కేసీఆర్ పాలనలో అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ స్వర్ణయుగమని, దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. తెలంగాణ రాకుంటే.. సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి కాకుంటే, నేను మంత్రిగా లేకుంటే సిద్దిపేట జిల్లా అయ్యేదా.. సిద్దిపేటకు సాగు, తాగునీరు వచ్చేదా.. అని అన్నారు. స్వరాష్ట్రంతో దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా సిద్దిపేట పేరు నిలిచిందన్నారు. ‘సిద్దిపేటను జిల్లా చేసుకున్నాం. సాగు తాగునీటి కలను నెరవేర్చినం. కొద్ది రోజుల్లోనే రైలు రాబోతున్నది’ అని అన్నారు. అభివృద్ధికి ఆకర్షితులై బీజేపీ, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరినీ ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. అందరికీ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు.
టీఆర్ఎస్లో చేరిన వివిధ పార్టీల నేతలు
‘సిద్దిపేట అంటే అభివృద్ధి.. అభివృద్ధి అంటే హరీశ్‌రావు.. సిద్దిపేట నియోజకవర్గం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుంది’. మంత్రి హరీశ్‌రావు అభివృద్ధి మార్క్‌కు ఇది ఒక నిదర్శమని పార్టీలో చేరిన దరిపల్లి శ్రీనివాస్, ఇబ్రహీం, బాబు అన్నారు. 70 ఏండ్లలో చేయని అభివృద్ధి, సంక్షేమం ఎనిమిదేండ్లలో సాధ్యం చేసి ప్రజల కండ్ల ముందు ఉంచారని, ఇది సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు అభివృద్ధి మార్క్ అని వారు చెప్పారు.