సిద్దిపేట,జూన్2: సిద్దిపేటకు జిల్లా కోర్టు రావడం అభినందనీయమని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీ రు హరీశ్‌రావు అన్నారు. బుధవారం రాత్రి సిద్దిపేటలోని విపంచి కళానిలయంలో న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. మొదట్లో కోర్టు భవనం కూలిపోయే స్థితిలో ఉండేదని, దాని స్థానంలో అప్పట్లోనే జిల్లా న్యాయస్థానానికి సరిపోయే విధంగా కోర్టు భవనం నిర్మించుకున్నామన్నారు.బార్రూమ్, అడ్వాకేట్ వెంకట్రావ్ పేరిట వారి కుటుంబ సభ్యుల సహకారంతో లైబ్రరీ ఏర్పాటు చేసుకున్నామన్నారు. 2005లో నాలుగో అదనపు కోర్టు,2008లో ఆరో అదనపుకోర్టు సాధించుకున్నామన్నారు. అప్పటి చీఫ్ సెక్రటరీ రమాకాంత్‌రెడ్డి వద్ద పైల్ పెడింగ్‌లో ఉండగా దాన్ని అనుసరిస్తూ సచివాలయ చరిత్రలో చీఫ్ సెక్రటరీ కార్యాలయం ఎదుట ఎమ్మెల్యేగా గంటసేపు ధర్నా చేస్తే సిద్దిపేటకు ఆరో అదనపు కోర్టు వచ్చిందని, రాజశేఖర్‌రెడ్డి హయంలో జరిగిన సంఘటనను ఆయన గుర్తు చేసుకున్నారు.న్యాయవాదులు యోగా, వాకింగ్ చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మంత్రికి జ్ఞాపికను అందజేశారు.
వివిధ పనుల పురోభివృద్ధిపై సమీక్ష
నియోజకవర్గంలోని ఆయా మండలాల పరిధిలో గ్రామాల వారీగా గొర్రెల హాస్టళ్ల నిర్మాణం, డబుల్బెడ్రూం ఇండ్ల పురోగతిపై బుధవారం రాత్రి మంత్రి హరీశ్‌రావు ఆయా మండలాల ప్రజా ప్రతినిధులతో సమీక్ష జరిపారు. తుది దశకు చేరుకున్న పనులను తొందరగా పూర్తి చేసి ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని పంచాయతీరాజ్ అధికారులను మంత్రి ఆదేశించారు. అనంతరం సిద్దిపేట పట్టణంలోని 1వార్డు పరిధిలోని లింగారెడ్డిపల్లి పెద్దమ్మ ఆలయ 16 వార్షికోత్సవంలో పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు పెద్దమ్మ అలయంలో ప్రత్యేక పూజలు చేశారు.సిద్దిపేట పట్టణంలోని గాంధీచౌక్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ నూతన కాంస్య విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు శాంతి కపోతాలను ఎగురవేశారు. మంత్రి వెంట మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి,మున్సిపల్ వైస్ చైర్మన్ కనకరాజు, నాయకులు పాల సాయిరాం, మచ్చ వేణుగోపాల్‌రెడ్డి ఉన్నారు.