గజ్వేల్, మే 31 : వ్యవసాయ రంగంలో సిద్దిపేట జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మంగళవారం గజ్వేల్ పట్టణంలోని మహతి ఆడిటోరియంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో సిద్దిపేట, మెదక్ జిల్లాల వానకాలం 2022 సాగు సన్నాహక సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలిసి మంత్రి హరీశ్‌రావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడక ముందు రైతులు పంట పండించడానికి సాగునీరు లేక, ప్రభుత్వ సహకారం అందించక, కష్టపడి పం టలు పండిస్తే వాటికి సరైన మద్దతు ధర లేకపోవడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకునేవారన్నారు. ఇప్పుడు తెలంగాణ సాధించిన తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, కాళేశ్వరం తదితర ప్రాజెక్టులతో సాగునీరు, రైతుబంధుతో పెట్టుబడి, సకాలంలో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించడంతో ఊహకందని రీతిలో ధాన్యం పండిస్తున్నారన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని తూకం వేయడానికి కాంటాలు సరిపోవడం లేదని, బస్తాల్లో నింపడానికి, రైస్ మిల్లుల్లో దింపడానికి హమాలీలు వేరే రాష్ర్టాల నుంచి వస్తున్నారన్నారు.
ధాన్యాన్ని నిల్వ చేయడానికి గోదాములు కూడా సరిపోనంత స్థాయికి రాష్ట్ర వ్యవసాయ రంగం అభివృద్ధి చెందిందన్నారు. ఒకప్పుడు ఉపాధి కోసం ఇతర రాష్ర్టాలకు, దేశాలకు ఈ ప్రాంతం రైతులు వలస వెళ్లగా ప్రస్తుతం ఆపరిస్థితిలేదన్నారు. ఉపాధికోసం పశ్చిమబెంగాల్, బిహార్ తదితర రాష్ర్టాల నుంచి కూలీలు వస్తున్నారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు ఉన్నంత క్రేజ్ వ్యవసాయదారులకు ఉందని, సాఫ్ట్‌వేర్‌తో సమానంగా కొంతమంది రైతులు వ్యవసాయరంగంలో ఆదాయాన్ని ఆర్జిస్తున్నారన్నారు. మండుటెండల్లో కూడా ఉమ్మడి మెదక్ జిల్లాలోని వాగులు కాళేశ్వరం ప్రాజెక్టు నీటితో కళకళలాడతున్నాయని, చెరువు మత్తడి దుంకుతున్నాయన్నారు. రాష్ట్రంలో 7272 మంది రైతు కుటుంబాలకు రైతుబీమా అందించామన్నారు.
సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో వ్యవసాయ రంగానికి దిశానిర్దేశం చేసేది రైతు బంధు సమితి సభ్యులేనన్నారు. రాష్ట్ర బడ్జెట్లో రూ.1000కోట్లు ఆయిల్‌పామ్ సాగు సబ్సిడీకి కేటాయించారన్నారు. ఆయిల్పామ్తోటలు సాగు చేసే విధంగా రైతులను ప్రోత్సహించాలన్నారు. ఈ సంవత్సరం సిద్దిపేట జిల్లాలో 30 వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్ మొక్కలు నాటేందుకు లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నామని, ఆ దిశగా రైతులను చైతన్య పర్చాలన్నారు. ఏఈవోలు రైతుల వద్దకు వెళ్లి ఆయిల్‌పామ్ సాగు చేయడంతో కలిగే లాభాలను వివరించాలన్నారు.
వచ్చే సంవత్సరం మెదక్ జిల్లాలో ఆయిల్‌పామ్ మొక్కలు అందిస్తామన్నారు. మల్బరీసాగు పెంచడానికి రూ.3లక్షల సబ్సిడీ ఉందని, రైతులను సెరీకల్చర్, తక్కువ ఖర్చుతో అధికలాభాలు గడించే పంటలు పండించడానికి అవగాహన కల్పించాలన్నారు. వరిసాగులో వెదజల్లే పద్ధతిని ప్రోత్సహించాలన్నారు. గజ్వేల్, మెదక్, మేడ్చల్ ప్రాంతాల్లో విత్తన కంపెనీలు ఉన్నాయన్నారు. సిద్దిపేట జిల్లాలో 25శాతం విత్తన పంటలు పండించాలన్నారు. పచ్చిరొట్టె ఎరువులతో అధిక దిగుబడి వస్తుందన్నారు. రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ ఎరువులు అధికంగా వాదాలని రైతులకు సూచించారు.
ములుగు హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్లో పెంచిన మిరపనారుతో ఎకరానికి రూ.4లక్షల విలువైన మిర్చి దిగుబడి సాధించారని, ఈ సంవత్సరం మిర్చి, టమాట, ఇతర కూరగాయల మొక్కలను అత్యధికంగా పెంచి రైతులకు అందించాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డిని కోరారు. మెదక్, గజ్వేల్ వరకు రైల్వేలైన్ విస్తరించినందున ఎరువుల గోదాములను గజ్వేల్ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని కోరారు.
కార్యక్రమంలో మెదక్, జనగామ, మానకొండూరు ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, డాక్టర్ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, జడ్పీ చైర్పర్సన్లు రోజాశర్మ, హేమలతాశేఖర్‌గౌడ్, సిద్దిపేట, మెదక్ కలెక్టర్లు హనుమంతరావు, హరీశ్, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, పీఏసీఎస్ చైర్మన్లు, రైతు బంధు సమితి జిల్లా, మండల, గ్రామ కోఆర్డినేటర్లు, ఆత్మ చైర్మన్లు, జిల్లా వ్యవసాయాధికారి శివప్రసాద్, ఉద్యానవన అధికారి రామలక్ష్మి, ఏడీఏలు బాబునాయక్, అనిల్, జిల్లా వ్యవసాయ, ఉద్యానవన, ఆయిల్‌ఫెడ్ సిబ్బంది పాల్గొన్నారు.
దేశానికి అన్న పెట్టే స్థాయికి తెలంగాణ..
-వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి
తెలంగాణ సాధించిన తర్వాత సీఎం కేసీఆర్ ముందస్తు ప్రణాళికతో దేశానికి అన్నంపెట్టే స్థాయికి రాష్ట్రం ఎదిగిందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. 60శాతం జనాభా ఆధారపడి ఉన్న వ్యవసాయరంగం అభివృద్ధి సాధిస్తేనే మిగతా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమన్నారు. అత్యధిక మందికి ఉపాధి ఇచ్చే వ్యవసాయరంగం సుస్థిరం చేయడం కోసం రైతులకు పాఠ్యాంశాలు రూపొందిస్తున్నామన్నారు. రైతు వేదికల్లో సంవత్సరం పొడవునా రైతులకు లాభసాటి వ్యవసాయంపై శిక్షణ ఇస్తామని, వీటిలో రైతులతో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొనాలన్నారు. ఆయిల్‌పామ్‌కు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రవ్యాప్తంగా ఆ దిశగా రైతులను ప్రోత్సహిస్తున్నామన్నారు. రూ.300 కోట్లతో సిద్దిపేటలో పామాయిల్ పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నామన్నారు. రైతులను సమీకృత వ్యవసాయంతో ప్రోత్సహించాలన్నారు. ఒకే పంట కాకుండా ఉన్న భూమిలోనే సాధారణ పంటలతో పాటు పండ్ల, కూరగాయ పంటలు పండించాలన్నారు. కోళ్లను పెంచాలని రైతులకు సూచించారు.
30 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు 24 గంటల ఉచిత విద్యుత్
రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి
రాష్ట్రంలో వ్యవసాయరంగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా 30 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేయిస్తున్నామని రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ఏడు విడతల్లో రైతు బంధు పథకం ద్వారా రూ.7500 కోట్లు రైతుల ఖాతాల్లో జమచేశామన్నారు. వ్యవసాయాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని 2604 మంది వ్యవసాయ విస్తరణ అధికారులను నియమించినట్లు తెలిపారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పిస్తున్నామన్నారు.