హుస్నాబాద్, మే 24: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘పల్లె ప్రగతి’తో ఆ గ్రామ రూపురేఖలను పూర్తిగా మార్చేసింది. ఆ గ్రామంలో ఏ గల్లీ చూసినా పరిశుభ్రంగానే కనిపిస్తున్నది. తడి, పొడి చెత్త సేకరణపై గ్రామస్తులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండటంతో ఇండ్లలోని చెత్త సేకరణ ప్రక్రియ సులువవుతోంది. సేకరించిన చెత్తను డంపింగ్ యార్డుకు తరలించి అక్కడ చెత్తను వేరు చేసి వివిధ అవసరాలకు వాడుకుంటున్నారీ గ్రామస్తులు. చెత్తను తమ పంచాయతీ ట్రాక్టర్లో వేస్తూ తమ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ముందుంటున్నారు. గ్రామస్తులను చైతన్యం చేసి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేలా కృషి చేస్తున్న సర్పంచ్ తోడేటి రమేశ్, పంచాయతీ పాలకవర్గాన్ని గ్రామస్తులే కాకుం డా చుట్టు పక్కల గ్రామాల ప్రజలు కూడా అభినందిస్తున్నారు. పల్లె ప్రగతిలో గ్రామం ముందంజలో ఉండటం, పంచాయతీ పాలకవర్గం గ్రామ పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించడం, హరితహారంలోనూ ప్రత్యేకత చాటుకోవడంతో హుస్నాబాద్ మండలంలోని పందిల్ల గ్రామానికి ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు వచ్చింది. జనవరి 26, 2020న కలెక్టర్ చేతుల మీదుగా సర్పంచ్ రమేశ్ అవార్డు అందుకోవడం విశేషం.
ప్రజలకు సంపూర్ణ అవగాహన.. నిత్యం చెత్త సేకరణ..
గ్రామ ప్రజలకు పరిశుభ్రత, చెత్త సేకరణ తదితర అంశాలపై సర్పంచ్ రమేశ్‌తో పాటు పాలకవర్గ సభ్యులు, సంబంధిత అధికారులు పలుమార్లు సమావేశాలు నిర్వహించడం ద్వారా, ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయడం ద్వారా సంపూర్ణ అవగాహన కల్పించారు. దీంతో ప్రతి ఇంట్లోనూ తడి, పొడి చెత్త వేర్వేరుగా పోగు చేసి ట్రాక్టర్లో వేస్తున్నారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ చెత్త సేకరణపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. గ్రామంలోని రహదారిలో ప్లాస్టిక్ కవర్లు గానీ, చెత్తా చెదారం కనిపిస్తే పారిశుధ్య కార్మికుల కోసం చూడకుండా వాటిని తీసి కూడళ్లలో ఏర్పాటు చేసి చెత్తకుండీల్లో వేస్తా రంటే ఇక్కడి ప్రజలకు పరిశుభ్రతపై ఎంత మక్కువ ఏర్పడిందో అర్థమవు తున్నది. డంపింగ్ యార్డు నిర్వహణపై కూడా పారిశుధ్య కార్మికులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. గ్రామంలోని డ్రైనేజీల నిర్వహణ సైతం పకడ్బందీగా ఉంటుంది. మురికినీరు ఎప్పటికప్పుడు గ్రామం నుంచి డ్రైనేజీల ద్వారా బయటకు వెళ్తుండ టంతో దోమల బెడద కూడా తగ్గిందని గ్రామస్తులు చెబుతు న్నారు. గ్రామంలోని వీధులన్నీ కూడా ఎల్లప్పుడు పరిశుభ్రంగా కనిపిస్తున్నాయి.
జిల్లాలోనే ఆదర్శ పల్లె ప్రకృతివనం
పల్లె ప్రగతిలో భాగంగా గ్రామంలో నిర్మించిన పల్లె ప్రకృతి వనం జిల్లాకే ఆదర్శంగా నిలుస్తోంది. ఎకరం స్థలంలో 43 రకాల మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తున్నారు. ఇందులో వాకింగ్ కోసం ప్రత్యేక దారులను ఏర్పాటు చేశారు. పూలు, పండ్ల మొక్కలతో పాటు ఆహ్లాదానాన్ని పంచే రకరకాల మొక్కలు దాదాపు 2,500 మొక్కలు నాటారు. పందిల్ల-పొట్లపల్లి గ్రామాల మధ్యలో ప్రధాన రహదారిపై ఉండటంతో పొట్లపల్లి స్వయంభూ రాజేశ్వరస్వామిని దర్శించుకున్న భక్తులు ఈ పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించి ఆహ్లాదాన్ని పొందుతున్నారు. గ్రామం నుంచే కాకుండా చుట్టుప క్కల గ్రామాల నుంచి కూడా ఈ వనాన్ని తిలకించేందుకు నిత్యం జనం వస్తుంటారు. ప్రభుత్వం పల్లె ప్రకృతి వనాలను నిర్మించి గ్రామాలను కూడా పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
డంపింగ్ యార్డులో ఎరువుల తయారీ..
గ్రామంలో సేకరించిన తడి, పొడి చెత్తతో పంచాయతీకి అదనపు ఆదాయం సమ కూర్చుకోవడంతో పాటు కంపోస్టు ఎరువులను తయారుచేసి హరిత హారం మొక్కలకు వాడుతున్నారు. పొడి చెత్తలోని ప్లాస్టిక్ వ్యర్థాలను వేరు చేసి విక్రయిస్తున్నారు. డంపింగ్‌యార్డులో తడి వ్యర్థా లను నిల్వచేసి అందులో వానపాములను వేసి కంపో స్టు ఎరువును తయారు చేస్తున్నారు. ఈ ఎరువును హరితహారం మొక్కలకు వాడుతుండటంతో గ్రామంలోని దాదాపు అన్ని మొక్కలు ఏపుగా పెరిగి పచ్చదనాన్ని నింపుతు న్నాయి. ప్రతి శుక్రవారం డ్రైడే విధిగా నిర్వహిస్తున్నారు. ఇదంతా గ్రామ పంచా యతీలో పనిచేసే కేవలం ఐదుగురు పారిశుధ్య కార్మికులతోనే సాధ్యమ వుతోందంటే గ్రామస్తుల సహకారం ఎంత ఉందో తెలుస్తోంది.
గ్రామస్తుల సహకారంతోనే..
గ్రామస్తులు, పాలక వర్గం సహకారంతోనే గ్రామాన్ని పరిశు భ్రంగా ఉంచగలు గుతున్నాం. ప్రతి ఇంటికీ చెత్త బుట్టలు పంచి, చెత్తపై అవగాహన కల్పించాం. విధిగా చెత్తబుట్టలో వేసి ప్రతి రోజు ఉదయం ఇంటి వద్దకు వచ్చే ట్రాక్టర్లో వేస్తున్నారు. డంపింగ్ యార్డుకు తరలించిన తడి చెత్తతో ఎరువు తయారు చేస్తున్నాం. రాబోయే రోజుల్లోనూ పందిల్ల గ్రామాన్ని అన్ని రంగాల్లోనూ ముందుంచేందుకు కృషి చేస్తాం.
– తోడేటి రమేశ్, సర్పంచ్, పందిల్ల
రోడ్లన్నీ పరిశుభ్రంగా ఉంటున్నయ్..
మా గ్రామంలో రోడ్లన్నీ పరిశుభ్రంగా ఉంటున్నయ్. రోడ్లపై చెత్త పడినా, పిచ్చి మొక్కలు పెరిగినా వెంటనే పంచాయతీ కార్మికులు తొలిగిస్తారు. డ్రైనేజీలు కూడా క్లీన్‌గా ఉంచుతుండ్రు. మా పంచాయతీ వాళ్లు చేస్తున్న కృషి ఎంతో మంచిది. గ్రామస్తులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. సర్కారు వాళ్లు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి గ్రామాలను శుభ్రంగా ఉంచడం ఆనందంగా ఉంది.
– వెల్దండి సత్యనారాయణ, గ్రామస్తుడు, పందిల్ల