సిద్దిపేట, మే 24 : అత్యవసరమైతేనే ప్రైవేటు దవాఖానకు పోవాలని, సిద్దిపేట ప్రభుత్వ దవాఖానలో అన్ని రకా ల సేవలు అందుబాటులో ఉన్నాయని, త్వరలోనే క్యాత్‌ల్యాబ్ అందుబాటులోకి తేనున్నామని మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు. మంగళవారం సిద్దిపేటలోని తన నివాసంలో పట్టణంలోని 23మందికి రూ.10.50లక్షలు, నియోజకవర్గ పరిధిలోని 66మందికి రూ.25లక్షల 93వేల సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. నిరుపేదలకు ఆపద్బాంధువు.. సీఎం సహాయనిధి పేదలకు సాయం.. పొందేందుకు అండగా నిలుస్తున్నదని చెప్పడానికి సిద్దిపేట నియోజకవర్గమే నిదర్శమని చెప్పారు. గత ప్రభుత్వాలు తమపార్టీ వారికే సీఎం సహాయనిధి చెక్కులు ఇచ్చారని, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి తారతమ్యాలకు తావులేకుండా అర్హులైన ప్రతి ఒక్క నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందిస్తూ సహకరిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోనే అతి ఎక్కువగా సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు రూ.21 కోట్లు అందించినట్లు చెప్పారు. ఈ చెక్కులను వెంటనే తమ బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకోవాలని సూచించారు.
కుల సంఘ భవనాలకు ప్రొసీడింగ్స్..
చిన్నకోడూరు మండలం రంగాయిపల్లి యాదవ కమ్యూనిటీ హాల్‌కు రూ.10 లక్షలు, సికింద్లాపూర్రెడ్డి కాలనీలో కమ్యూనిటీ హాల్‌కు రూ.5 లక్షలు, ఏకలవ్య కమ్యూనిటీ హాల్‌కు రూ.5 లక్షలు, మేడిపల్లిలో కమ్యూనిటీ హాల్ రూ.10 లక్షలు, మండల కేంద్రమైన నంగునూరులో ఆటో యూనియన్ భవన నిర్మాణానికి రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.40 లక్షల ప్రొసీడింగ్ కాపీలను ఆయా మం డల, గ్రామ ప్రజాప్రతినిధులకు మంత్రి చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరాం, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
బొడ్రాయి ప్రతిష్ఠకు హాజరు..
మండలంలోని చిట్యాల గ్రామంలో రెండు రోజులుగా కొనసాగుతున్న నల్లపోచమ్మ దేవి, బద్దిపోచమ్మ దేవి సహిత మహాశీతలి(నాభిశిల) బొడ్రాయి సార్గలమ్మ దేవాత విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమానికి మంత్రి హరీశ్‌రావు హాజరయ్యారు. హోమం తదితర పూజల్లో మంత్రి పాల్గొన్నారు. గ్రామానికి వచ్చిన మంత్రి హరీశ్‌రావుకు ఉత్సవ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికి శాలువాలు కప్పి సన్మానించారు.