దుబ్బాక, ఏప్రిల్ 24: మండలంలోని ఆకారం గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన మెట్ల కిరణ్ రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడల్లో పతకాలు సాధించాడు. స్వగ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదోతరగతి పూర్తి చేసి ప్రస్తుతం దుబ్బాకలో డిగ్రీ (బీఏ) ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. కిరణ్ తండ్రి బాల నర్సయ్య ఆర్థిక ఇబ్బందులతో గత నాలుగేండ్ల కిందట మృతి చెందాడు. దీంతో తల్లి కవితకు వ్యవసాయ
పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటూ..డిగ్రీ చేస్తున్నాడు. పాఠశాల స్థాయిలో సరదాగా ఆడిన ఆటలే ..నేడు కిరణ్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపును తీసుకొచ్చాయి. ఆర్థిక ఇబ్బందుల కారణంగా అంతర్జాతీయ పోటీల్లో అవకాశం వచ్చినా వెళ్లలేని పరిస్థితి ఉంది. పాఠశాలలో కిరణ్ రన్నింగ్, కబడ్డీపోటీల్లో అత్యున్నత ప్రతిభ కనబర్చడంతో..వ్యాయామ ఉపాధ్యాయుడు భాను గమణించి, జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలకు ప్రోత్సహించాడు. అండర్-17లో కబడ్డీ, రన్నింగ్‌లో పతకాలు సాధించాడు. అనంతరం ఇంటర్ చదువుకుంటూనే (నేషనల్ మీట్) జాతీయ స్థాయి పోటీలో పాల్గొని రజత, బంగారు పతకాలు సాధించాడు.
బంగారు పతకం
గతేడాది (2021) జాతీయ స్థాయి రన్నింగ్ పోటీలో పాల్గొని మెట్ల కిరణ్ బంగారు పతకం సాధించాడు. అదే సంవత్సరం కబడ్డీలో కూడా రజత పతకం సాధించాడు. కిరణ్ నిత్యం వేకువ జామున, సాయంత్రం రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తుంటాడు. రన్నింగ్‌లో జిల్లా స్థాయిలో కాకుండా జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సాధించాడు. కిరణ్ అద్భుత క్రీడాస్ఫూర్తిని కనబరుస్తూ 2021 అక్టోబర్‌లో తమిళనాడులో ‘తమిళనాడు రూరల్ గేమ్స్ అసోసియేషన్’ ఆధ్వర్యంలో సౌత్ జోనల్ గేమ్స్ పోటీలో పాల్గొని సీనియర్ విభాగంలో కిరణ్ 5కే రన్లో బంగారు పతకం సాధించాడు. 2021 ఆగస్టులో ఢిల్లీలో నిర్వహించిన 5కే రన్లో ద్వితీయ స్థానం (రజత పతకం) సాధించాడు. 2021 జూలైలో గుజరాత్లో నిర్వహించిన 4వ నేషనల్ యూత్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో 5కే రన్‌తో పాటు కబడ్డీలో రజత పతకాలు సాధించాడు. అనంతరం నేపాల్‌లో నిర్వహించిన ఇంటర్నేషనల్ చాంపియన్ షిప్పోటీలో 5కే రన్ అండర్-17లో పాల్గొనే అవకాశం వచ్చింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆ పోటీలకు వెళ్లలేకపోయాడు. కిరణ్ క్రీడాస్ఫూర్తిని తెలుసుకున్న స్థానిక ప్రజాప్రతినిధులు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించి, కిరణ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. అంతర్జాతీయ పోటీలకు వెళ్లేందుకు పూర్తి సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
అంతర్జాతీయ పోటీలో పాల్గొనాలని ఉంది..
రన్నింగ్‌తో పాటు కబడ్డీపై ప్రత్యేక ఆసక్తి ఉంది. అదే నన్ను జాతీయ స్థాయిలో పాల్గొనేలా చేసింది. అంతర్జాతీయ స్థాయి పోటీలో పాల్గొని పతకం సాధించాలనే కోరిక ఉంది. గ్రామంలో ఉదయం, సాయంత్రం రన్నింగ్ చేస్తా. ప్రస్తుతం 5కే రన్ 15 నిమిషాల్లో పూర్తి చేస్తున్నా. మరింత తక్కువ సమయంలో 5కే రన్ పూర్తిచేసి రికార్డు సాధించాలని ఉన్నది. ఢిల్లీ, గుజరాత్లో జరిగిన 5కే రన్ పోటీల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. స్పోర్ట్స్ కళాశాలలో అవకాశం కల్పిస్తే.. అనుకున్న లక్ష్యం మరింత త్వరగా చేరుకునే అవకాశం ఉంటుంది. క్రీడల్లో పూర్తి సహకారం అందిస్తానని మెదక్ ఎంపీ ప్రభాకర్‌రెడ్డి ఇచ్చిన హామీ నాకెంతో బలాన్ని ఇచ్చింది.
-మెట్ల కిరణ్, క్రీడాకారుడు