చేర్యాల, మార్చి 28 : కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో కీలకమైన అగ్నిగుండాల కార్యక్రమం ఆదివారం అర్ధరాత్రి ప్రారంభమై సోమవారం వేకువజాము వరకు ఉత్కంఠ భరితంగా కొనసాగింది.మల్లన్న ఆలయవర్గాల నేతృత్వంలో మహంతేశ్వర శివాచార్య స్వామీజీ పర్యవేక్షణలో నిర్వహించిన అగ్నిగుండాల కార్యక్రమం భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగింది. స్వామివారి బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించే అగ్నిగుండాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అగ్నిగుండం దాటి మల్లికార్జున స్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరడంతో పాటు కష్టాలు తొలిగిపోతాయని భక్తుల నమ్మకం. ఆలయ ఈవో ఎ.బాలాజీ, ధర్మకర్తల మండలి చైర్మన్ గీస భిక్షపతి, ధర్మకర్తలు, అర్చకులు, సిబ్బంది ఆధ్వర్యంలో స్వామివారి కల్యాణ వేదిక ప్రాంగణంలో ఆదివారం రాత్రి 7గంటలకు వీరభద్ర ప్రస్తాయం, భద్రకాళి పూజ, 11 గంటలకు అగ్నిగుండాల ప్రజ్వలన కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం ఉదయం 5 గంటలకు గురుపూజ, బలిహరణం, అగ్నిగుండాల ప్రవేశం, విజయోత్సవం, ఉదయం 11గంటలకు స్వామి, అమ్మవార్లకు ఏకాదశ రుద్రాభిషేకం, మహామంగళ హారతి,మంత్రపుష్పం, జంగమార్చాన, అనంతరం తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు.
భక్తిశ్రద్ధలతో అగ్నిగుండాలు…
కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ వర్గాలు వీరశైవ ఆగమశాస్త్ర పద్ధతిలో అగ్నిగుండాల కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ముందుగా పంచ పళ్లవాలైన మర్రి, మేడి, మామిడి, మోదుగు, జువ్వి(ఐదు రకాల చెట్లకు సంబంధించిన కర్రలు)ను తీసుకువచ్చి ఒక్కచోట పేర్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పంచ పళ్లవాలను అంటించి నిప్పు తయారు కాగానే, వాటిని అగ్నిగుండంగా తయారు చేశారు.అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఆలయ అర్చకులు గర్భాలయం నుంచి కల్యాణ వేదిక ఆవరణకు తీసుకువచ్చి మొదటగా అగ్నిగుండం దాటించారు. అనంతరం భక్తులు అగ్నిగుండం దాటి ఆలయ గర్భగుడిలో స్వామిని దర్శించుకున్నారు. కార్యక్రమాల్లో ఆలయ ఏఈవోలు వైరాగ్యం అంజయ్య, ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్, ధర్మకర్తలు తూముల రమేశ్‌యాదవ్, ఉటుకూరి అమర్, ధరావత్ అనిత, తాళ్లపల్లి శ్రీనివాస్, కొంగరి గిరిధర్, చింతల పరుశరాములు,తివారీ దినేశ్ కుమార్, బొంగు నాగిరెడ్డి, శెట్టె అయిలయ్య, ముత్యం నర్సింహులు, పోతుగంటి కొమురెల్లి, గడ్డం మహేశ్ యాదవ్, సాయియాదవ్, పర్యవేక్షుడు నీలశేఖర్, సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు. అడిషనల్ డీసీపీ మహేందర్, హుస్నాబాద్ ఏసీపీ సతీశ్ ఆధ్వర్యంలో సీఐ శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో ఎస్సైలు చంద్రమోహన్, భాస్కర్‌రెడ్డి, నారాయణ, పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.
గణనీయంగా పెరిగిన భక్తుల సంఖ్య…
తెలంగాణలో ప్రముఖ ఆలయాల్లో ఒకటైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. 11వ ఆదివారం సందర్భంగా నిర్వహించిన అగ్నిగుండాల కార్యక్రమంతో ఉత్సవాలు ముగిసినట్లు ఆలయవర్గాలు తెలిపాయి. ఎక్కడా లేనివిధంగా మూడు నెలల పాటు బ్ర హ్మోత్సవాలు ఇక్కడ నిర్వహిస్తారు. 11 వారాల పాటు నిర్వహించిన ఉత్సవాలకు భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. గతేడాది డిసెంబర్ 26న స్వామి వారి కల్యాణోత్సవంతో ప్రారంభమైన ఉత్సవాలు, సంక్రాంతి అనంతరం వచ్చిన మొదటి ఆదివారం నుంచి 11వారాల పాటు వైభవంగా కొనసాగాయి. స్వామి కల్యాణం, పెద్దపట్నం, అగ్నిగుండాల కార్యక్రమాల నిర్వహణ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున్న తరలివచ్చారు. దీంతో బుకింగ్, హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో పెరిగాయి. ఆలయ చరిత్రలోనే మొదటిసారిగా హుండీ ఆదాయం మూడుసార్లు రూ.కోటి దాటింది.
వీఐపీల రాక గణనీయంగా పెరిగింది. స్వామి కల్యాణోత్సవానికి మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, చామకూర మల్లారెడ్డి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి హాజరై పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ టి. పద్మారావు,పలు జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, న్యాయమూర్తులు, అధికారులు, ఇతర ప్రముఖులు మల్లన్న క్షేత్రాన్ని దర్శించుకున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్‌తో పాటు రాష్ట్రంలోని 31 జిల్లాలకు చెంది న భక్తులతో పాటు మహారాష్ట్ర ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల నుంచి కొమురవెల్లికి తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ఉత్సవాలను విజయవంతం చేసేందు కు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ గీస భిక్షపతి, ఈవో ఎ.బాలాజీ, ఏఈవోలు వైరాగ్యం అంజయ్య, పర్యవేక్షకుడు నీల శేఖర్, అర్చకులు, ఒగ్గు పూజారులు, సిబ్బంది శ్రమించారు.
ఆదాయం రెట్టింపు..
కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో 11వ ఆదివారం సందర్భంగా రూ.52,13,460 ఆదాయం వచ్చిందని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ గీస భిక్షపతి విలేకరులకు తెలిపారు. ఆలయంలో సోమవారం చైర్మన్ విలేకరులతో మాట్లాడుతూ.. శనివారం రూ.2,89,286, ఆదివారం రూ.49,24,174తో ఆదాయం స్వామి వారికి ఖజానాకు సమకూరిందన్నారు. ఆర్జిత సేవలు, ప్రసాదాల విక్రయాలు, దర్శనాలు, కాటేజీలు తదితర వాటి ద్వారా ఆదాయం సమకూరిందన్నారు. గతేడాది అగ్నిగుండాల కార్యక్రమం శని,ఆది,సోమవారం కలిపి రూ.21,75,863 వచ్చిందన్నారు.