సిద్దిపేట టౌన్, జూన్ 10: అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే అక్షర సత్యాన్ని సిద్దిపేట కేదార్నాథ్ అన్నదాన సేవాసమితి నిజం చేసింది. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్న అనే నానుడిని అచరణలో చేసి చూపుతున్నది. అక్కడ ఇక్కడ కాదు..చార్దామ్ యాత్రలో ముఖ్యమైన.. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ప్రధానమైన కేదారేశ్వరుడి సన్నిధిలో అన్నదానం చేయాలని సంకల్పించి సాహసోపేతమైన ఘట్టానికి 2019లో బీజం వేసింది. అప్పటి నుంచి హిమగిరుల్లోని పరమశివుడిని దర్మించుకునే భక్తులకు అన్నదానం చేస్తున్నది. ఈ పరంపరను నాలుగోసారి కొనసాగిస్తున్నది. ఈ నేపథ్యంలో యాత్రికులకు సిద్దిపేట సేవా సమితి అందిస్తున్న సేవలపై ప్రత్యేక కథనం..
తెలుగువారి అన్నదానం శిబిరం
సిద్దిపేటకు చెందిన కేదార్నాథ్ అన్నదాన సేవా సమితి సభ్యులు 2019లో 30 మందితో సేవాసమితిని ప్రారంభించారు. కేదార్‌నాథ్‌లో అన్నదానం చేయాలని బలంగా అనుకున్నారు. మాజీమంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు సేవాసమితిలో గౌరవ సభ్యులుగా ఉన్నారు. దీంతో ఉత్తరాఖండ్‌లోని కేదార్నాథ్ స్వామి చెంత దక్షిణ భారతదేశంలోనే మొదటి తెలుగు వారి అన్నదాన శిబిరం (లంగర్) ఏర్పాటైంది.
మందాకి నది వంతెన..
ఉత్తరాఖండ్‌లో వెలిసిన కేదారేశ్వరుడి ఆలయానికి 21 కి.మీ దూరంలోని సోన్‌ప్రయాగ్ మందాకిని నది వంతెన దాటగానే సిద్దిపేట కేదార్నాథ్ అన్నదాన సేవాసమితి వారు అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఏడాది నూతంగా కేదార్నాథ్ ఆలయనికి దగ్గరగా మరో అన్నదాన కేంద్రాన్ని భక్తుల కోరిక మేరకు ప్రారంభించారు. 100 మంది సేవాసమితి సభ్యులు విడుతల వారీగా పరమశివుడి దర్శనానికి వచ్చే భక్తులకు సేవ చేస్తూ ఆ దేవదేవుడి అనుగ్రహం పొందుతున్నారు.
సాహస యాత్రలో పంచభక్ష పరమన్నాలు
మంచుకొండలో వెలిసిన దేవదేవుడి దర్శనం అంటే మామూలు విషయం కాదు. చుట్టూ మంచు కొండలు.. లోయలు మైనస్ డిగ్రీ ఉష్ణోగ్రతలు..భిన్న వాతావరణ పరిస్థితులు. అలాంటి చోట సిద్దిపేట కేదార్నాథ్ అన్నదాన సేవా సమితి భక్తులుకు పంచభక్ష పరమన్నాలు వడిస్తూ శివ భక్తుల మన్ననలు పొందుతున్నది. తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు శిబిరం నిర్వీరామంగా కొనసాగుతున్నది. భక్తులకు దక్షిణాది భోజనంతో పాటు రుచికరమైన అన్ని రకాల తెలుగు వంటకాలను అందిస్త్తూ కండునింపుతున్నది. అన్నం, పులిహోర, పెరుగన్నం, అల్పాహారాలు, మిఠాయిలు, పానీపూరి వరకు అన్ని రుచికరమైన వంటలను సమకూర్చుతున్నారు. భక్తుల సహాయార్థం సమాచార సెంటర్‌ను ప్రత్యేకంగా ప్రారంభించి సాయం చేస్తున్నారు. లంగర్లో సుమారు రెండు వందల మందికి రాత్రి సమయంల్లో వసతి కల్పించి సిద్దిపేట ఖ్యాతిని గర్వంగా చాటుతున్నారు.
దైవ సంకల్పం..
కేదార్నాథ్ స్వామి చెంత అన్నదానం చేయడం దైవసంకల్పం.. మానవ సేవ మాధవ సేవగా భావించి గొప్ప దైవ కార్యానికి శ్రీకారం చుట్టాం. మంచుకొండల్లో వెలిసిన దేవదేవుడి సేవ అదృష్టం అందరికీ రాదు. నాలుగోసారి అన్నదానం చేయడం సంతోషంగా ఉంది. ఈ ఏడాది భక్తుల సౌకర్యార్థం మరో అన్నదానం శిబిరాన్ని ఏర్పాటు చేశాం. మంచుకొండల్లో అన్నదానం స్వామి అనుగ్రహంతో నిర్వీరామంగా కొనసాగుతున్నది.
– చీకోటి మధుసూదన్, కేదార్నాథ్ అన్నదాన సేవా సమితి అధ్యక్షుడు
స్వామివారి సన్నిధిలో సేవ చేయడం అదృష్టం
కేదారేశ్వరుడి చెంత అన్నదానం చేయడం మధురానుభూతి..ఇంత గొప్ప సత్ కార్యం జీవితంలో మరోటి లేదు. దేశంలో అద్భుత క్షేత్రం..కేదార్నాథ్.. అంతంటి మహిమాన్విత ఆలయ దర్శనానికి వచ్చే భక్తులకు అన్నప్రసాదం అందించడం అదృష్టం. అందరి సహకారంతో మంచుకొండల్లో అన్నదానం చేస్తున్నాం. – అయిత రత్నాకర్, సమితి సెక్రటరీ