
హుస్నాబాద్, మే 26: రసాయనాలు, ఎరువులు మోతాదుకు మించి వాడడంతో భూమిలోని సారం పూర్తిగా తగ్గిపోయి పంటల దిగుబడులు పడిపోతున్నాయి. రసాయనాలతో రైతులు పండించిన పంటలోనూ నాణ్యత లేకపోవడం, తద్వారా ఇవి తిన్న ప్రజలు అనారోగ్యం బారిన పడుతారు. ప్రభుత్వం, వ్యవసాయ శాస్త్రవేత్తలు సేంద్రియ, సహజ సిద్ధమైన పచ్చిరొట్ట ఎరువులను ఉపయోగించి పంటలు పండించాలని సూచిస్తున్నారు. సేంద్రియ ఎరువుల్లో ముఖ్యంగా వర్మీకంపోస్టు, పశువుల పేడను వినియోగిస్తారు. వీటి తయారీకి అధిక ఖర్చు అయ్యే అవకాశం ఉన్నందున పచ్చిరొట్ట ఎరువులు అతితక్కువ ఖర్చుతో తయారు చేసుకోవచ్చని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. తొలకరి జల్లులు కురవగానే పచ్చిరొట్ట పైర్లను సాగుచేయాలి. వానకాలం పంట సాగుకు ఎరువులు సిద్ధంగా ఉం టాయి. పచ్చిరొట్ట పైర్లలో 16 రకాలు ఉంటాయి. ఇందులో జీలుగ, అవిశ, జనుము, వెంపల్లి, అలసంద, పిల్లిపెసర, పెసర, మినుము, గోడు చిక్కుడు, అజోల్ల, కానుగ, వేప, ైగ్లెసిడియా, జిల్లేడు, నేల తంగేడు, కొండ మిరుప తదితర రకాలు ఉన్నాయి. వరితో పాటు ఏ పంట సాగు చేసినా నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులు అవసరం. ఇవి పచ్చిరొట్ట పైర్లు సాగు చేయడం ద్వారా పుష్కలంగా సమకూర్చుకునే అవకాశం ఉంది.
పచ్చిరొట్ట ఎరువులను రెండు రకాలుగా
సాగు తయారు చేసుకోచ్చు…
1) పచ్చిరొట్ట పంటలైన జనుము, జీలుగ, పిల్లిపెసర, ఉలవ, పెసర, అలసంద వంటి పైర్ల విత్తనాలు దుక్కిలో వెదజల్లాలి. పెరిగిన తర్వాత 50 శాతం పూత దశలో పొలంలో కలియదున్ని కుళ్లిన తర్వాత పంటను వేసుకోవాలి.
2) వేప, నేలతంగేడు, కానుగ, గ్రైరిసిడిరియాకు సంబంధించిన మొక్కల ఆకులను, కొమ్మలను సేకరించాలి. వీటిని పొలంలో వేసి కలియదున్ని మురగనివ్వాలి. ఆ తరువాత ప్రధాన పంటను వేసుకోవాలి.
సాగు విధానం తర్వాత…
వేసవిలో పంటలు కోయగానే దుక్కి దున్నుకోవాలి. తొలకరి జల్లులు పడగానే పచ్చిరొట్ట విత్తనాలను వేసుకోవాలి. నీటి వసతి ఉంటే వేసవిలోనే సాగు చేయడం లాభదాయకం. పసుపు, కంది, చెరుకు వంటి పంటల మధ్య కూడా పచ్చిరొట్ట పైర్లను పూతదశంలో కలియదున్నుకోవాలి. పచ్చిరొట్ట పైర్లను సాగు చేసేందుకు ఎక్కువ విత్తనాలను చల్లుకోవాలి. తక్కువ విత్తనాలు చల్లితే మొక్కలు పెరడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది.
పచ్చిరొట్ట ఎరువుల ఉపయోగాలు..
పచ్చిరొట్ట పైర్లను పొలంలోనే కలియ దున్నడంతో అధికంగా వృద్ధి చెందుతాయి. ఫలితంగా భూసారం పెరుగుతున్నది.
భూమిని గుల్లపరిచి నీటి నిల్వ సామర్థ్యం అధికం అవుతున్నది.
భూమిలో లభ్యంకాని రూపంలో ఉండే అనేక పోషకాలను లభ్యరూపంలోకి మారుస్తాయి.
పచ్చిరొట్ట పైర్లు పువ్వు జాతి మొక్కలకు చెందినవి. కాబట్టి గాలిలోని నత్రజనిని పీల్చుకొని స్థిరీకరిస్తాయి.
రైబోజియం అనే బ్యాక్టీరియా గాలిలోని నత్రజనిని మొక్క వేర్లలోని బొడిపెలలో నిల్వచేసి ఎకరానికి 25నుంచి 50కేజీల నత్రజనిని అందిస్తాయి.
చౌడు భూముల పునరుద్ధరణకు జీలుగ, సీమ జీలుగ మొక్కలు ఎంతో ఉపయోగపడుతాయి.
పచ్చిరొట్టతో భాస్వరం, గంధకం లభ్యత చాలా పెరుగుతున్నది.
రసాయన ఎరువులు ఉపయోగించడానికి బదులుగా పచ్చిరొట్ట సాగు చేస్తే ఎన్నో విధాలుగా ఉపయోగకరంగా ఉంటుంది.
పెట్టబడి ఖర్చు తగ్గడంతో పాటు భూసారం పెరుగుతున్నది.
జింక్, మాంగనీసు, ఇనుము, కాల్షియం లాంటి సూక్ష్మధాతువులను పంటకు చేర్చుతాయి.
నేల సహజ మిత్రులైన వానపాముల వృద్ధికి దోహదపడుతాయి.
తుంగ, గరిక లాంటి గడ్డి మొక్కలను పెరుగుదలను పచ్చిరొట్ట ఎరువులు అడ్డుకుంటాయి.
నేలలో కరగని మూలకాలనూ కరిగించి పంటకు అనుకూలంగా మార్చుతాయి.
సహజసిద్ధంగా ఎరువులు లభిస్తుండడంతో పంటల్లో రసాయనాల శాతం కూడా తగ్గుతున్నది. దీంతో వినియోగదారులకు స్వచ్ఛమైన ధాన్యం, మంచి ఆరోగ్యం లభిస్తున్నది.
పచ్చిరొట్ట పైర్ల విత్తనాలకు ప్రభుత్వం 65 శాతం సబ్సిడీ..
పంటలపై రసాయనాలు, ఎరువుల ప్రభావాన్ని తగ్గించి సహజసిద్ధ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పచ్చిరొట్ట పైర్ల విత్తనాలను 65శాతం సబ్సిడీపై అందజేస్తోంది. జీలుగ విత్తనాలు కిలో ధర రూ.53.50 కాగా, ప్రభుత్వం రూ.34.78 సబ్సిడీ ఇస్తున్నది. మిగిలిన రూ.18.72లు చెల్లించి రైతులు విత్తనాలు కొనుగోలు చేసుకోవచ్చు. జీలుగ 30కిలోల బస్తాల్లో లభిస్తున్నందున రూ.561.60 చెల్లించి తీసుకోవాలి. జనుము కిలో ధర రూ.66.36 కాగా, ప్రభుత్వం రూ.43.13 సబ్సిడీ ఇస్తున్నది. జనుములో 40కిలోల బస్తా లభిస్తున్నందున బస్తాకు రూ.929.20 చెల్లించి తీసుకోవాలి. పిల్లిపెసర విత్తనాలు 20కిలోల బస్తా సబ్సిడీ పోను రూ.576 చెల్లించాలి. సోయా చిక్కుడు విత్తనాలు కిలోకు రూ.96.50 ధర ఉండగా, 30కిలోల బస్తాను సబ్సిడీ పోను రూ.1718.10 చెల్లించి కొనుగోలు చేయాలి. పచ్చిరొట్ట పైర్ల సాగుకు సబ్సిడీపై విత్తనాలు లభిస్తున్నందున ఈ వానకాలంలో రైతులందరూ వీటిని సాగు చేసి ప్రధాన పంట ఆరోగ్యంగా, సహజ సిద్ధంగా పెరిగి చేతికొచ్చేలా చూసుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
జీలుగ సాగు విధానం..
జీలుగ పంటను చౌడు భూములు, వరి పండించే భూముల్లో సాగుచేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఎకరానికి 20కిలోల విత్తనాలు అవసరం. మొక్కలు పెరిగి పూతదశకు వచ్చేసరికి 6 నుంచి 8 టన్నుల పచ్చిరొట్ట లభిస్తున్నది. వీటిని అదేపొలంలో కలియ దున్ని మురగ పెట్టినట్లయితే 30 నుంచి 32 కిలోల యూరియా లభిస్తున్నది. ఈ పంటను సాగు చేయడం ద్వారా పొలంలో వేయాల్సిన యూరియా కన్నా 30 నుంచి 32 కిలోలు తక్కువగా వేసినా సరిపోతున్నది. వీటిద్వారా 3.5శాతం నత్రజని, 0.6శాతం భాస్వరం, 1.2శాతం పొటాష్ లభిస్తున్నది.
జనుము సాగు విధానం…
జనుము సాగు చేసేందుకు ఎకరానికి 9 నుంచి 14కిలోల విత్తనాలు అవసరం. దీని ద్వారా ఎకరానికి 5 నుంచి 6 టన్నుల పచ్చిరొట్ట లభిస్తున్నది. వీటిని పొలంలోనే కలియ దున్నితే 24 కేజీల యూరియా అందుతున్నది. ఇందులోనూ 2.3శాతం నత్రజని, 0.5శాతం భాస్వరం, 1.8శాతం పొటాష్ ఉంటాయి.
పెసర, మినుము..
పెసర, మినుము పచ్చిరొట్టతో ఎకరానికి 15నుంచి 20 కిలోల యూరియా వస్తున్నది. వరిసాగు చేసే పొలాల్లో వీటిని వేసుకోవడంతో లాభం ఉంటుంది. భారీగా నత్రజని కూడా లభిస్తున్నది. పూతదశకు రాగానే పొలంలోని దున్ని మురగపెడితే పచ్చిరొట్ట ఎరువు తయారవుతున్నది. సహజసిద్ధ ఎరువు కావడంతో వరిధాన్యం నాణ్యతగా ఉండడంతోపాటు ఈ పంట ద్వారా వచ్చిన బియ్యం తిన్న ప్రజలు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు.
అవిశ పంట సాగు…
అవిశ పంటకు ఎకరానికి 16కేజీల విత్తనాలు అవసరం. దీని ద్వారా సుమారు 40కేజీల నత్రజని ఉత్పత్తి కావడం విశేషం. సెస్బానియం పచ్చిరొట్ట సాగు చేయాలనుకుంటే ఎకరానికి 16కేజీల విత్తనాలు వేసుకోవాలి. ఎకరం పొలానికి 70కేజీల దాకా నత్రజని లభిస్తున్నది.
అలసంద, పిల్లి పెసర పంట…
అలసంద సాగుకు ఎకరానికి 15కేజీల విత్తనాలు అవసరం ఉంటాయి. ఈ మొక్కలను పొలంలో కలియదున్నితే 60 కేజీల వరకు నత్రజని ఉత్పత్తి అవుతున్నది. పిల్లిపెసర ఎకరానికి కేవలం 6కేజీల విత్తనాలు సరిపోతాయి. దీని ద్వారా ఏకంగా 40కేజీల నత్రజనిని పొలంలో ఉత్పత్తి చేసుకోవచ్చు.