
సిద్దిపేట, జూన్ 25 : దేశంలో ఎక్కడా లేనివిధంగా పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్ల కోసం సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేటలో ఆయన నివాసంలో నియోజకవర్గ పరిధిలోని చిన్నకోడూరు మండలానికి చెందిన 103 మందికి రూ.కోటీ 3 లక్షలు విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని తెలిపారు. మంత్రి వెంట సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరికీ కొవిడ్ టీకా..
పద్దెనిమిదేండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ కొవిడ్-19 టీకా ఇవ్వాలని, ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలని మంత్రి హరీశ్‌రావు సంబంధిత అధికారులకు ఆదేశించారు. జిల్లా కేంద్రం సిద్దిపేట విపంచి ఆడిటోరియంలో నిత్యం జరుగుతున్న వ్యాక్సినేషన్ తీరును శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్, సంబంధిత రికార్డులను పరిశీలించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో పాల్గొన్న సిబ్బందితో మాట్లాడారు. వ్యాక్సినేషన్ కోసం రోజు ఎంత మంది వస్తున్నారని ఆరా తీయగా 300 నుంచి 400 మంది వరకు వస్తున్నారని టీకా అంటే భయం, షుగర్ వ్యాధి కారణంగా రాలేకపోతున్నామని ప్రజలు చెబుతున్నారని అధికారులు మంత్రికి తెలిపారు. సెంటర్లో రోజుకు 2 వేల మందికి టీకా వేసే దిశగా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. మంత్రి వెంట మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు తదితరులు ఉన్నారు.
మొబైల్ షీ టాయిలెట్ బస్సు ప్రారంభం..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అన్ని పట్టణ ప్రాంతాల్లో ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒకటి చొప్పున టాయిలెట్ల నిర్మాణం చేపడుతున్నామని, 50 శాతం షీ టాయిలెట్స్ పూర్తయ్యాయని మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట మున్సిపాలిటీలో రూ.20 లక్షలతో ఏర్పాటు చేసిన మొబైల్ షీ టాయిలెట్ బస్సును మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. సిద్దిపేట పట్టణంలో ఇప్పటికే 47 టాయిలెట్స్ ఉండగా బస్సుతో కలుపుకొని 48 టాయిలెట్స్ అందుబాటులోకి వచ్చాయన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా సిద్దిపేట పట్టణంలో 176 టాయిలెట్స్ సిట్టింగ్స్ నిర్మించామన్నారు. బహిరంగ ప్రదేశాల్లో, సభలు, సమావేశాలకు వచ్చినప్పుడు మహిళలు ఇబ్బందులు పడుతున్నారని, మూత్ర విసర్జనకు ఇబ్బంది కాకుండా ప్రత్యేకంగా మహిళల కోసమే ఈ మొబైల్ షీ బయో టాయిలెట్ బస్సును ఏర్పాటు చేశామన్నారు.ఈ బస్సులో 4 టాయిలెట్స్ ఉన్నాయని బస్సు వినియోగానికి సౌర విద్యుత్‌ను వినియోగిస్తున్నట్లు తెలిపారు. మీటింగ్‌లు, సమావేశాలు, మరియు అవసరమున్న చోటుకు బస్సు వస్తుందన్నారు. జాతరలు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో అందుబాటులో ఉంటుందన్నారు. మంత్రి మున్సిపల్ చైర్పర్సన్ మంజులారాజనర్సు, కమిషనర్ రమణాచారి పాల్గొన్నారు.