
సిద్దిపేట అర్బన్, జూన్ 25 : తెలంగాణ రాష్ట్రం రావడం రైతులకు ఓ వరమని, సీఎం కేసీఆర్ వ్యవసాయానికి కొత్త రూపు తెచ్చి దశ, దిశ మార్చివేశారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపం చి కళానిలయంలో ఆత్మ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి మంత్రి హరీశ్‌రా వు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ మేరకు మంత్రి సమక్షంలో ఆత్మ కమిటీ చైర్మన్‌గా లక్కరసు ప్రభాకర్ వర్మతో పాటు 24 మంది కమిటీ సభ్యులు ప్రమాణం స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. కొత్త ఆలోచనలతో ప్రారంభమై మార్పుకు శ్రీకారం మనమే చూట్టాలని, రైతులకు బ్యాంకుల్లో అప్పులు కాకుండా నిల్వ ఉండేలా పని చేద్దామన్నారు. భవిష్యత్‌లో రైతులు అధిక ఆదాయం ఆర్జించేందుకు పంట మార్పిడి తప్పదన్నారు. రైతులకు ఆధునిక వ్యవసాయంపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఆత్మ కమిటీదేనన్నారు.
ఆత్మకమిటీ రైతుసేవకే పునరంకితం కావాలని మంత్రి హరీశ్‌రావు కోరారు. ఆత్మ పథకం రైతులకు అభివృద్ధి, శిక్షణ, నూతన ప్రదర్శన క్షేత్రాలు వంటి కార్యక్రమాలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. ఈ ఏడు రాష్ట్రంలో విత్తనం పెట్టకముందే, వాన చినుకు పడకముందే 60 లక్షల 83 వేల 793 మంది రైతులకు రూ.7300 కోట్లు రైతుబంధు నిధులు బ్యాంకుల్లో జమ చేశామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ కోసం రూ.3వేల 200 కోట్లు వెచ్చించగా, ఇవాళ మన రాష్ట్రంలో ఏటా రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ ఏడు జిల్లాలో 50 వేల ఎకరాల్లో పామాయిల్ విత్తన సాగు చేసేలా రైతులను ఆత్మకమిటీ పోత్సహించాలన్నారు. వరి వెదసాగు, మల్బరీ సాగు, ఆయిల్ పామ్ తోటలు విరివిగా పెంచేలా రైతులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఆత్మకమిటీపై ఉందన్నారు. జిల్లాలో ఆదర్శంగా సాగు చేస్తున్న పంట పొలాలకు రైతులను తీసుకెళ్లి సాగుపై అవగాహన కల్పించడం లాంటి పనులు ముమ్మరం చేయాలని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజాశర్మ, జిల్లా రైతుబంధు సమితి కన్వీనర్ వంగ నాగిరెడ్డి, డీఏవో శ్రవణ్, ఏఎంసీ చైర్మన్ పాల సాయిరాం, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, వ్యవసాయ అధికారులు, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.