రాయపోల్ ఆగస్టు 05 : దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్ రంగురంగులతో తళుక్కుమంటోంది. గతంలో పెయింటింగ్ లేకపోవడం, పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా లేకపోవడం, వర్షానికి తేమ రావడం వంటి కారణంగా పోలీస్ స్టేషన్ రంగు వెలసి కనిపించేది. అయితే.. ఎస్ఐ గంగాధర అరుణ్ కుమార్ (Arun Kumar) తన మొదటి వేతనంతో పాటు పలువురి దాతల సహకారంతో మరమ్మతు పనులు చేపట్టి పోలీస్ స్టేషన్ ఎంతో ఆహ్లాదంగా మార్చారు.
ఎస్సై మంగళవారం మాట్లాడుతూ.. ‘నేను ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం పోలీస్ స్టేషన్లో పలు సమస్యలు ఉండడం గమనించాను. సిబ్బందితో పాటు దాతల సహకారంతో పోలీస్ స్టేషన్కు రంగులు వేయించాను. దీంతో పోలీస్ స్టేషన్ ఆవరణ ఎంతో అందంగా, ఆహ్లాదకరంగా మారింది. స్టేషన్కు వచ్చే వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులు ఏర్పాటు చేశాం’ అని తెలిపారు.
రంగులు వేసిన తర్వాత కొత్తగా, ఆహ్లాదకరంగా మారిన పోలీస్ స్టేషన్
శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరు సహకారం అందించాలని ఎస్సై కోరారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా గ్రామాల్లో గంజాయి వంటి మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని, వారి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. గ్రామాల్లో ఎవరైనా గంజాయి విక్రయిస్తే సమాచార అందించాలని చెప్పారు. అంతేకాదు చిన్నపాటి గొడవలు పెట్టుకొని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగవద్దని సూచించారు. మండల ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చిన తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామని.. ప్రజల రక్షణ కోసమే పోలీస్ శాఖ పని చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
పోలీస్ స్టేషన్ పాత ఫొటో