సంగారెడ్డి, జూన్ 22 : ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో డీసీసీబీ పరిధిలో రూ.451 కోట్ల పంట రుణాలు మాఫీ కానున్నాయని చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి తెలిపారు. శనివా రం సంగారెడ్డిలోని డీసీసీబీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. పంట రుణమాఫీకి సంబంధించి కటాఫ్ తేదీలను ప్రభుత్వం ప్రకటించి రైతులకు మరో శుభవార్త చెప్పిందన్నారు. 12 డిసెంబర్ 2018 నుంచి 31 డిసెంబర్ 2023 వరకు వివిధ బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్న రుణమాఫీ వర్తిస్తుందని తెలిపారు. డీసీసీబీ బ్యాంకులో రూ.451కోట్ల రుణాలు మాఫీ అవుతాయని, తిరిగి ఆ మొత్తం రుణాలు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో రెండెకరాలు కలిగిన రైతులకు ఇండ్ల నిర్మాణానికి రూ.15 లక్షల రుణం ఇస్తున్నామన్నారు. మండల కేంద్రాల్లో రూ.40లక్షలు, పట్టణ ప్రాంతాల్లో ఇండ్లు కట్టుకునే వారికి రూ.75లక్షల వరకు రుణాలు ఇస్తున్నామని తెలిపారు. మహిళా సంఘాలు, టర్మ్ లోన్లు, వాహనాలకు రుణాలు, వ్యాపార రుణాలు అందజేస్తున్న ట్లు చెప్పారు. సమావేశంలో డైరెక్టర్లు రమేశ్, వెంకట్రామ్లు, చంద్రయ్యస్వామి, పద్మ దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.