చిన్నకోడూర్, మార్చి 07: సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని రామంచకు చెందిన ఆర్మీ విశ్రాంత ఉద్యోగి ఎడ్ల శ్రీకాంత్ రెడ్డి (38) గురువారం అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం అంత్యక్రియలు జరిగాయి. అంత్యక్రియలకు ఆర్మీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు హాజరయ్యారు.
స్థానికుల కథనం ప్రకారం.. రామంచకు చెందిన ఎడ్ల శ్రీకాంత్ రెడ్డి (38) ఆర్మీలో పనిచేసి ఐదేళ్ల క్రితం రిటైర్డ్ అయ్యారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో పలు వ్యాపారాలు చేస్తూ కుటుంబాన్ని పోషించుకున్నాడు. అయితే ఆ వ్యాపారల్లో నష్టాలు రావడంతో కొన్నాళ్లుగా అప్పులు పెరిగాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో బుధవారం హైదరాబాద్ నుంచి రామంచకు వచ్చాడు. గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు.
శ్రీకాంత్ రెడ్డి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బాలకృష్ణ తెలిపారు. శ్రీకాంత్ రెడ్డి మరణ వార్త తెలుసుకున్న సిద్దిపేట జిల్లా సైనిక్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బందెల సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీకాంత్ రెడ్డి మృతదేహానికి మాజీ సైనికులు నివాళులర్పించారు. ఆయన పార్థివదేహంపై జాతీయ పతాకం ఉంచి గౌరవించారు. ఈ సందర్భంగా సురేందర్ రెడ్డి మాట్లాడుతూ.. జవాన్ శ్రీకాంత్ రెడ్డి కుటుంబానికి అసోసియేషన్ తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మల్లిఖార్జున్, ట్రెజరరీ డీ జోజి, జనరల్ సెక్రటరీ చంద్రం తదితరులు పాల్గొన్నారు.