Friendship | రాయపోల్, ఆగష్టు 03 : తమతో కలిసి మెలిసి తిరిగిన స్నేహితుడు ప్రమాదంలో మృతి చెందగా.. అతని కుటుంబానికి అండగా మేమున్నామంటూ తోటి స్నేహితులు ముందుకొచ్చారు. సిద్దిపేట జిల్లా రాయపోల్ గ్రామానికి చెందిన గల్వా సత్తి రెడ్డి గతవారం లారీ ఢీకొని మృతి చెందాడు. స్నేహితుల దినోత్సవం రోజు ఆపదలో ఉన్న సత్తిరెడ్డి కుటుంబానికి స్నేహితులంతా కలిసి తమవంతుగా ఆర్థికసాయం అందజేసి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు.
గల్వా సత్తి రెడ్డి గతవారం మరణించిన విషయం తెలుసుకొని రాయపోల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో1993 పదవ తరగతి బ్యాచ్ స్నేహితులంతా కలిసి వారి కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. పూర్వ విద్యార్థి మృతి చెందిన విషయాన్ని వాట్సాప్ గ్రూప్ ద్వారా 1993 పదవతరగతి బ్యాచ్ మిత్రులకు సమాచారం చేరవేయగా అందరూ కలిసి వారికి తోచిన విధంగా ఆర్థిక సహాయం అందజేసి వారి ఔదార్యాన్ని చాటుకున్నారు.
స్నేహితుల దినోత్సవం సందర్భంగా మృతి చెందిన స్నేహితుని కుటుంబానికి ఆర్థిక సాయం అందించడం ద్వారా తమ మానవత్వాన్ని చాటుకుంటూనే.. మరోవైపు ఎంతో మందికి స్పూర్తిదాయకంగా నిలుస్తున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు దరువు అంజన్న, గుమ్మల్ల అశోక్ రెడ్డి, హరీష్ రెడ్డి, సోమేశ్వర్ పంతులు, కమ్మరి యాదగిరి, సత్తుగారి మహేందర్ రెడ్డి, లోట్ల శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు