సిద్దిపేట/చేర్యాల, జనవరి 10 : సిద్ధిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న క్షేత్రంతోపాటు చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లో సోమవారం భారీ వర్షం కురిసింది. గతంలో ఎన్నడూలేని విధంగా సంక్రాంతి పండుగ ముందు వర్షం కురవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వరినార్లతోపాటు ఆలస్యంగా సాగు చేసిన పత్తి పంటలకు వర్షంతో నష్టం కలిగింది. సాయంత్రం వేళ 4.20 నిమిషాలకు ప్రారంభమైన వర్షం ఐదు గంటల వరకు కురవడంతో వీధుల్లో వరద నీరు ప్రవహించింది. కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో భక్తులు ఇబ్బందులు పడ్డారు. చేర్యాల మండలంలోని కడవేర్గులో 20 నిమిషాల పాటు వడగండ్ల వాన కురవడంతో రైతులు, గ్రామస్తులు అవస్థలు పడ్డారు. కొమురవెల్లి మండల కేంద్రంలోని చేర్యాల-కొమురవెల్లి రహదారిలో వరద రోడ్డుపైకి చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
కోహెడలో..
మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం నుంచే వాతావరణం మబ్బులు పట్టి ఉండగా, మూడు గంటల ప్రాంతంలో ఉరుముల శబ్ధాలు వినిపించాయి. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో చిరుజల్లులతో మొదలై భారీ వర్షం కురిసింది. శీతాకాలంలో వర్షం కురవడం 10 సంవత్సరాల్లో ఇదే మొదటిసారని ప్రజలు చర్చించుకున్నారు. వర్షంతోపాటు చల్లని గాలులు వీయగా, దాదాపు గంట పాటు వర్షం కురిసింది. దీంతో, మండల కేంద్రంతో పాటు పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇండ్లలోకి నీరు రావడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
గజ్వేల్లో..
గజ్వేల్లో భారీ వర్షం కురిసింది. సోమవారం సాయంత్రం ప్రారంభమైన రాత్రి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఇప్పటికే చలితో ఇబ్బందులు పడుతున్న ప్రజలు వర్షం పడడంతో చలి తీవ్రతను తట్టుకోలేకపోతున్నారు. మరోవైపు ప్రజ్ఞాపూర్ – గజ్వేల్ రోడ్డుకు ఇరువైపులా పచ్చని చెట్లపై మేఘాలు కమ్ముకోవడంతో ఆ దృశ్యం ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకున్నది. అదే విధంగా మెదక్ జిల్లా చేగుంట, మనోహరాబాద్ మండలాల్లో పలు గ్రామాల్లో కూడా వర్షం పడింది.