మెదక్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లాలో ఇంటి పన్నుల వసూళ్ల ప్రక్రియ జోరుగా సాగుతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.11.01కోట్లు లక్ష్యంకాగా, ఇప్పటివరకు రూ.7.74 కోట్లు వసూలయ్యాయి. వచ్చే ఏడాది మార్చి నెలాఖరు వరకు మిగతా రూ. 3.27 కోట్లు వసూలు చేసి వందశాతం పూర్తి చేసేందుకు అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ఇందుకోసం పంచాయతీ సిబ్బందికి టార్గెట్ విధించి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. ఊరూరా ఇంటింటికీ తిరిగి అవగాహన కల్పిస్తుండడంతో ప్రజలు సైతం పన్నులు కట్టేందుకు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు.
మెదక్ జిల్లాలో పంచాయతీ పన్ను వసూళ్లు లక్ష్యం దిశగా సాగుతున్నది. మార్చి 31 వరకు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని అధిగమించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ఇంటింటికీ వెళ్లి పన్ను వసూళ్లు చేపడుతున్నారు. మెదక్ జిల్లాలో 2023-24 సంవత్సరానికి సంబంధించి రూ.11.01 కోట్లు టార్గెట్గా నిర్ణయించగా, ఇప్పటి వరకు రూ.7.74 కోట్లు వసూలయ్యాయి. ఇంకా రూ.3.27 కోట్లు వసూలు కావాల్సి ఉంది. మార్చి నెలాఖరు వరకు వంద శాతం టార్గెట్ పూర్తి చేస్తామని జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబా వెల్లడించారు.
మెదక్ జిల్లా లక్ష్యం రూ.11.01 కోట్లు..
జిల్లాలో వంద శాతం పన్నుల వసూలు పూర్తి చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. మొత్తం 21 మండలాల్లో రూ. 11.01 కోట్లు టార్గెట్ ఉండగా, ఇప్పటివరకు రూ.7.74 కోట్లు వసూలయ్యాయి. ఇంకా రూ.3.27 కోట్లు వసూలు కావాల్సి ఉన్నది. జిల్లాలో వసూలు 70.29 శాతం నమోదు కాగా, 100 శాతం టార్గెట్ చేరుకునేందుకు అధికారులు పనిచేస్తున్నారు.
గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర పోషించనున్న ఇంటి పన్ను…
పల్లెల్లో ఇంటిపన్నుల చెల్లింపులో ప్రజలు ముందుంటారు. పన్నులు సకాలంలో చెల్లించి పంచాయతీల అభివృద్ధిలో కీలక పాత్రను పోషిస్తున్నారు. గత పదేండ్లలో గ్రామాల్లో వచ్చిన ఊహించని మార్పులతో ఇంటి పన్ను కట్టేందుకు ప్రజలు చొరవ చూపిస్తున్నారు. అంతేకాకుండా అధికారులు సైతం గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
వంద శాతం లక్ష్యాన్ని చేరుకుంటాం..
మార్చి నెలాఖరులోగా జిల్లాలో ఇంటి పన్ను వసూళ్లలో వంద శాతం లక్ష్యాన్ని చేరుకుంటాం. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.11 కోట్ల టార్గెట్ నిర్దేశించగా, ఇప్పటి వరకు రూ.7.74 కోట్లు వసూలయ్యాయి. ఇంకా రూ.3.27 కోట్లు రావాల్సి ఉంది. ఇప్పటి వరకు 70.29 శాతం పన్ను వసూళ్లు అయ్యాయి. గ్రామ పంచాయతీ సిబ్బందికి టార్గెట్లు విధించి పన్నులు వసూళ్లు చేస్తున్నాం. గ్రామాల్లో ప్రజలు అధికారులు, సిబ్బందికి సహకరించాలి. పన్నులు చెల్లించి గ్రామాభివృద్ధికి తోడ్పడాలి.
– సాయిబాబా, జిల్లా పంచాయతీ అధికారి, మెదక్