శివ్వంపేట, జూలై 13: ‘సారూ.. మీ కాళ్లు మొక్కు తాం… మాకు ఉన్న భూమి మొత్తం ట్రిపుల్ఆర్ రోడ్డులో పోతున్నది.. భూమికి భూమే ఇవ్వాలి’.. అని రత్నాపూర్ గ్రామ భూబాధితులు నర్సాపూర్ ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి కాళ్లపై పడి ప్రాధేయపడ్డ్డారు. శనివారం మెదక్ జిల్లా శివ్వంపేట మండలం రత్నాపూర్లో ట్రిపుల్ఆర్ సర్వేకు వచ్చిన అధికారులను రైతులు అడ్డుకోగా, నర్సాపూర్ ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి వచ్చి వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా భూ బాధితులు మాట్లాడుతూ.. తామంతా నిరుపేదలమని, ఉన్న భూమిపోతే తాము ఏం సాగుచేసుకొని బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ మోకమీదకు వచ్చి తమ మొర వినాలన్నారు.
తమకు భూమికి భూమి ఇవ్వాలని, లేకపోతే నష్టపరిహారం ఎంత ఇస్తారో చెప్పే వరకు సర్వే అధికారులను సర్వే చేయనీయమని తేల్చి చెప్పారు. దీంతో సర్వే అధికారులు చేసేదేమిలేక వెనుతిరిగారు. అంతకుముందు భూమికి బదులు భూమి ఇవ్వాలని ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. మాకున్న ఐదెకరాల భూమి ట్రిపుల్ఆర్ రోడ్డులో పోతుందని మస్తు రందైతున్నదని, మొత్తం పొలం రోడ్డులో పోతే మా గతి ఎట్ల కావాలని కర్న కమలమ్మ అనే భూబాధితురాలు ఆర్డీవో కాళ్లమీద పడి ప్రాధేయపడింది. ఆందోళనలో మాజీ ఎంపీటీసీ వాణీరామ్మోహన్రెడ్డి, మాజీ సర్పంచ్ సాలమ్మ, చిక్కుడు బాలేష్, కర్నం రాజు, బొగ్గుల విజయ్, కుమ్మరి వీరేశ్, బుచ్చమ్మ, మానెమ్మ, కమలమ్మ, శంకర్ తదితరులు ఉన్నారు.