దుబ్బాక / దుబ్బాక టౌన్ : కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే మేడిగడ్డ పై రాజకీయం చేస్తుందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి (MLA Prabhakar Reddy) ఆరోపించారు. శుక్రవారం పార్టీ ఎమ్మెల్యేలు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకుల బృందంతో కలిసి మేడిగడ్డను పరిశీలించారు. ఈ సందర్భంగా దుబ్బాక విలేకరులతో ఎమ్మెల్యే మాట్లాడుతూ మేడిగడ్డ (Medigadda) పై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆరోపించారు.
కుంగిన మూడు పిల్లర్ల (Pillars) ను మరమ్మతు చేసి రైతాంగాన్ని ఆదుకోవలసిన రాష్ట్ర ప్రభుత్వం స్వార్థ రాజకీయాల కోసం పాకులాడుతుందన్నారు. ఆరు నెలలో మేడిగడ్డ బ్యారేజీని పూర్తి చేసి రైతులకు సాగునీరు ఇవ్వాల్సింది పోయి రాజకీయం చేయడం మంచి పరిణామం కాదన్నారు. సాగు, తాగు నీరు లేక నాలుగు జిల్లాల ప్రజలు, రైతులు ఇబ్బందిపాలవుతున్నారని, ఇప్పటికైనా రైతులపై ప్రేమతో వెంటనే మరమ్మతు పనులు చేపట్టి పనులు పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
కుంగిన పిల్లర్ల వద్ద కాపర్ డ్యామ్ (Copper Dam) ను నిర్మించాలని అన్నారు. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టుతోనే తాగు, సాగు నీరుపై ప్రజలు ఆధారపడ్డారని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రాజెక్టుకు అనుసంధానమైన మల్లన్నసాగర్, కొండపోచమ్మ, రంగనాయకసాగర్ ద్వారా నీరు రాక రైతులు అయోమయంలో ఉన్నారన్నారు.