సంగారెడ్డి డిసెంబర్ 28(నమస్తే తెలంగాణ): ఆరు గ్యారెంటీల అమలు కోసమే ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభించిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. గురువారం సంగారెడ్డి పట్టణంలోని 3వ వార్డు, చౌటకూరు మండలంలోని శివ్వంపేట, అందోలు మండలంలోని అల్మాయిపేట, సంగుపేట గ్రామాల్లో మంత్రి ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దరఖాస్తులను పరిశీలించి ఆర్హులైన వారందరికీ ఆరు గ్యారెంటీలను వర్తింపజేస్తామని తెలిపారు. సంగారెడ్డి జిల్లాలోని 647 పంచాయతీలు, ఎనిమిది మున్సిపాలిటీల్లో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం ప్రత్యేకంగా 99 అధికారుల బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
6వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. ఆ తర్వాత కూడా పంచాయతీ సెక్రటరీలు, మున్సిపల్ అధికారులకు దరఖాస్తులు అందజేయవచ్చని తెలిపారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీలను పారదర్శకంగా అమలు చేయాలని కోరారు. కలెక్టర్ శరత్ మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లా అంతటా ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు చెప్పారు. ప్రతిరోజూ రెండు గ్రామాల్లో దరఖాస్తులు స్వీకరిస్తామని, దరఖాస్తు సమర్పించిన వారికి రసీదు ఇస్తామని తెలిపారు. మహిళలు, దివ్యాంగులు, వృద్ధ్దుల కోసం ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో జడ్పీచైర్‌పర్సన్ మంజుశ్రీజైపాల్‌రెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ రూపేశ్, ఆర్డీవో రవీందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ బొంగుల విజయలక్ష్మి, జడ్పీ సీఈవో ఎల్లయ్య, మెప్మా పీడీ గీత, అధికారులు పాల్గొన్నారు.
ప్రభుత్వం ప్రొటోకాల్ అమలు చేయటంలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గురువారం ప్రారంభమైన ప్రజాపాలన కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఎక్కడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫొటోలను ముద్రించలేదు. సంగారెడ్డి, పటాన్చెరు, జహీరాబాద్ నియోజకవర్గాల్లో నిర్వహించిన ప్రజాపాలన ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీల్లో ఎక్కడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్‌రావు, మహిపాల్‌రెడ్డి ఫొటోలను ముద్రించ లేదు.