బెజ్జంకి, మే 06 : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు, నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు -మన బడి కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంకల్లెపల్లిలో మన ఊరు మన బడి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తరగతి గదుల్లోనే దేశభవిష్యత్ ఆధారపడి ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రహించారు. అందుకే ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అభివృద్ధి చేసి విద్యార్థులకు మెరుగైన విద్యాను అందించి ఉన్నతులగా తీర్చిదిద్దాలని చర్యలు చేపడుతున్నారన్నారు.
కేజీ టూ పీజీ వరకు ఉచిత నాణ్యమైన విద్యాను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
విద్యావ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని పిల్లలు, వారి తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లింగాల నిర్మల, జడ్పీటీసీ కనగండ్ల కవిత, వైస్‌ఎంపీపీ సబిత, సర్పంచ్ లక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.