రాయపోల్, మార్చి 26 : గర్భిణీలు, బాలింతలు సమతుల్యమైన, పౌష్టికాహారం తీసుకోవడం ద్వారానే ఆరోగ్యంగా ఉంటారని జిల్లా ప్రోగ్రాం అధికారి సుప్రజ అన్నారు. రాయపోల్ మండల కేంద్రంలో రిలయన్స్ ఫౌండేషన్, క్రై ఆర్గనైజేషన్, మాత శిశు సంక్షేమ శాఖ సంయుక్తంగా ‘మన ఊరు – మన అంగన్వాడీ’ కళాజాత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సుప్రజ మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అవసరమైన పౌష్టికాహారం అందజేస్తోందని తెలిపారు.
అంగన్వాడీ సేవలపై అవగాహన సందర్భంగా తల్లి ఆరోగ్యం బాగుంటేనే శిశువు ఆరోగ్యంగా పెరుగుతుందని.. అందుకే గర్భిణీలు తప్పనిసరిగా సమయానికి పోషకాహారం తీసుకోవాలని జిల్లా ప్రోగ్రాం అధికారి సుప్రజ సూచించారు. బాలింతలు కూడా శిశువుకు సిరపోను పాలు అందించేందుకు ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆమె తెలిపారు.
చిన్నారుల సమగ్ర అభివృద్ధికి అంగన్వాడీ కేంద్రాలు కీలకంగా నిలుస్తున్నాయని, చిన్న వయస్సులోనే పిల్లలలో పాఠశాలకు వెళ్లే అలవాటును పెంపొందిస్తున్నాయని ఆమె వెల్లడించారు. ఆటలు, పాటలు, బొమ్మల ద్వారా పిల్లలలో నేర్చుకునే ఆసక్తిని పెంచేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని సుప్రజ పేర్కొన్నారు. పిల్లలలో శారీరక, మానసిక వికాసం సమతుల్యంగా ఉండేలా అంగన్వాడీ టీచర్లు కృషి చేస్తున్నారని ఆమె చెప్పారు.

ప్రతి నెల పిల్లల బరువును తూకం వేస్తూ వారి ఎదుగుదలపై నిఘా ఉంచుతున్నామని, పోషకాహార లోపాలు ఉంటే తల్లిదండ్రులకు సూచనలు ఇస్తూ అవగాహన కల్పిస్తున్నామని సుప్రజ వివరించారు. తల్లిదండ్రులు కూడా పిల్లల ఆహారంపై జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.
ఈ కార్యక్రమానికి ముందు కళాకారులు అంగన్వాడీ కేంద్రాల ప్రాధాన్యం, ఉచిత విద్య, బాలల హక్కులపై నృత్యాలు, జానపద గేయాలు, నాటికల రూపంలో గ్రామ ప్రజల్లో చైతన్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ షబానా, గ్రామ సర్పంచ్ మాసంపల్లి రాజు, బ్లాక్ కో-ఆర్డినేటర్ భాస్కర్, సౌత్ ఎవల్యూషన్ హెడ్ భవ్య, సీఆర్పీలు సుమతి, అంజలి, అంగన్వాడీ టీచర్లు ఆగమ్మ, రేఖ, పద్మ, సంతోష, రాధ, గ్రామ పెద్దలు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.