రాయపోల్,సెప్టెంబర్ 29 : రైతుల వ్యవసాయ బోర్వెల్ మోటర్లను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని సిద్దిపేట జిల్లా రాయపోల్ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ.1.13 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. తొగుట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్.కే. లతీఫ్ సోమవారం వివరాలను వెల్లడించారు. గత కొంతకాలంగా రాయపోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు, దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకటి మొత్తం ఐదు చోరీ కేసులకు పాల్పడిన పురుషోత్తం బాబు (37) అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో చోరీల వైపు మళ్లిన నిందితుడు, తన ద్విచక్ర వాహనంపై గ్రామ శివార్లలోని వ్యవసాయ భూములకు వెళ్లి బోర్ మోటర్లను రంపం సహాయంతో కట్ చేసి అపహరించేవాడు. అనంతరం వాటిని ఇనుప సామగ్రి కొనుగోలు చేసే గుర్తు తెలియని వ్యక్తులకు విక్రయించి వచ్చిన డబ్బును ఖర్చు చేసేవాడని విచారణలో వెల్లడైంది. ఇటీవల లింగారెడ్డిపల్లి గ్రామ శివారులో చోరీ చేసిన మోటరును గజ్వేల్‌లో విక్రయించేందుకు తీసుకెళ్తున్న సమయంలో కొత్తపల్లి ఎక్స్‌రోడ్డు వద్ద పోలీసులు నిర్వహిస్తున్న వాహన తనిఖీలను గమనించి పారిపోవడానికి ప్రయత్నించాడు.
అప్రమత్తమైన పోలీసులు అతడిని పట్టుకుని తనిఖీ చేయగా, బైక్‌పై ఒక మోటర్తో పాటు చోరీలకు ఉపయోగించిన రంపం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం విచారణలో గత కొన్ని నెలలుగా జరిగిన చోరీలకు తానే పాల్పడినట్లు నిందితుడు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.