దుబ్బాక, జూన్ 10: కేసీఆర్ ప్రభుత్వ హయాంలో దుబ్బాకలో వంద పడకల దవాఖాన భవన సముదాయాన్ని నిర్మించుకున్నామని, ఇక్కడ మూడు జిల్లాల ప్రజలకు వైద్యసేవలు అందటం చాలా సంతోషకరమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించి దుబ్బాకకు మంచిపేరు తీసుకురావాలని వైద్యులు, సిబ్బందికి ఎమ్మెల్యే సూచించారు. సోమవారం దుబ్బాక వంద పడకల దవాఖానలో నూతనంగా నియమితులైన స్టాఫ్‌నర్సులకు బ్యాడ్జిలను ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి అందజేశారు. అనంతరం దుబ్బాక వంద పడకల దవాఖానలో వైద్యసేవలపై, నియోజకవర్గంలోని పీహెచ్‌సీలకు సంబంధించిన వైద్య సిబ్బందితో వేర్వేరుగా సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా వైద్యాధికారి పుట్ట శ్రీనివాస్, డీసీహెచ్ఎస్ సాయికిరణ్, డిప్యూటీ డీఎంహెచ్‌వో కాశీనాథ్‌తో కలిసి ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.
సర్కారు దవాఖానలకు గుర్తింపు తీసుకురావాలి
ప్రభుత్వ దవాఖానల్లో పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించి, వైద్య వృత్తికి మరింత వన్నే తీసుకురావాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని దుబ్బాక, మిరుదొడ్డి, అక్బర్పేట-భూంపల్లి, తొగుట, దౌల్తాబాద్, రాయపోల్, చేగుంట, నార్సింగ్ మండలాల్లోని 10 పీహెచ్‌సీల వైద్య సిబ్బందితో సమీక్షలో పాల్గొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సంబంధించిన వివరాలతో పాటు ప్రజలకు అందిస్తున్న వైద్యసేవల గురించి తెలుసుకున్నారు. పలు పీహెచ్‌సీల్లో వైద్యులు, సిబ్బంది విధులు సక్రమంగా నిర్వహించడం లేదని ఎమ్మెల్యే ఆసంతృప్తి వ్యక్తం చేశారు. షుగరు, బీపీ రోగులకు మందులు ఇవ్వకుండా వాటిని వృథాగా పారేస్తున్నారని, పీహెచ్‌సీకి రోగులు రాకున్నప్పటికీ రికార్డుల్లో మాత్రం అత్యధికంగా ఓపీ, ఐపీ రోగులు వస్తున్నట్లు రాస్తున్నట్లు పలు ఆరోపణలున్నాయని తెలిపారు. పీహెచ్‌సీల్లో రాత్రివేళల్లో వైద్యులు ఉండటం లేదన్నారు. వైద్యులు, సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీంతో ప్రైవేటు దవాఖానలను ఆశ్రయిస్తున్నట్లు పలు విమర్శలు వస్తున్నాయని తెలిపారు. ఇకముందు అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సూచించారు. అంకితభావంతో పనిచేసి, ప్రజల మన్ననలు పొందాలని సూచించారు. పేదల వైద్యానికి ప్రభుత్వం కోట్ల్ల రూపాయలు వెచ్చిస్తున్నప్పటికీ పలుచోట్ల వైద్య సిబ్బంది తమ విధులపై నిర్లక్ష్యంగా వ్యవహరించటం బాధాకరమన్నారు. వారి పనితీరును మార్చుకుని ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలందించాలని సూచించారు. నియోజకవర్గంలో అత్యధికంగా గ్రామీణ పేదలే ఉన్నారని, పూర్తిస్థాయిలో ప్రభుత్వ వైద్య సేవలు అందించేందుకు వైద్యాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
ప్రతినెలా సమీక్షా సమావేశం
దుబ్బాక నియోజకవర్గంలోని పీహెచ్‌సీల్లో ప్రతినెలా సమీక్షా సమావేశం నిర్వహించాలని ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తొలిసారిగా సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లతో సైతం సమీక్ష నిర్వహిస్తామన్నారు. పీహెచ్‌సీల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. మూడు జిల్లాల సరిహద్దు ప్రాంతమైన దుబ్బాక వంద పడకల దవాఖానలో మరింత మెరుగైన వైద్య సేవలందించేందుకు వైద్యులు, సిబ్బంది కృషి చేయాలని సూచించారు. నియోజకవర్గం అభివృద్ధితో పాటు ప్రజలకు అందాల్సిన ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో వంద పడకల దవాఖాన సూపరింటెండెంట్ హేమరాజ్, తహసీల్దార్ వెంకట్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గన్నే వనితాభూంరెడ్డి, ఎంపీపీ కొత్త పుష్పలతాకిషన్రెడ్డి, జడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, కౌన్సిలర్లు దేవుని లలిత, ఆస యాదగిరి, స్వామి తదితరులు పాల్గొన్నారు.