రాయపోల్ మే 18 : ధాన్యం తూకం వేసి ఐదు రోజులు గడుస్తున్న లారీల కొరతతో రైతులు ఆగమాగం అవుతున్నారు. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం కొత్తపల్లి గ్రామ ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రంలో సమస్యలు కుప్పల్ తెప్పలుగా ఉన్నాయి. కొనుగోలు కేంద్రం ప్రారంభించి ఆరు రోజులు గడిచినప్పటికీ కేవలం ఒకేలారిని రైస్ మిల్లుకు తరలించారు. అందులో కూడా ఐదు సంచులు తరుగు వచ్చిందని రైతులు వాపోతున్నారు. కేంద్రంలో ఇప్పటికే 2271 బస్తాలు మిల్లుకు పోయేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ లారీలు రావడంలేదని దీంతో తాము బస్తాల వద్ద ఎర్రటి ఎండలో పడి కాపులు కాస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరో వెయ్యి బస్తాలు తూకం వేయాల్సి ఉందని తమ బాధలను ఎవరు పట్టించుకోవడంలేదని కొనుగోలు కేంద్రంలో ఎలాంటి వసతులు ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వడంలేదని, అధికారులు వస్తే తమ బాధలు చెప్పుకోవడానికి కుర్చీలు కూడా లేవని రైతులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరిపడా జల్లులు కేంద్రంలో ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అకాల వర్షాలు కురిస్తే తూకం వేసిన సంచులు తడిసిపోతే ఎవరు బాధ్యులని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఐకెపిలో అధికారుల సమన్వయం లేకపోవడం వలన తమకు ఈ దుస్థితి నెలకొందని వాపోయారు. రైతులే సొంతంగా వాహనాలు పెట్టుకొని మిల్లులకు తరలించాలని ఐకెపి సిబ్బంది చెప్పడం పట్ల రైతులు ఆగ్రహంతో ఉన్నారు.
ఎప్పుడూ లేనిది ఇప్పుడు తాము వాహనాలు ఎందుకు పెడతామని మండిపడుతున్నారు. మండలానికి ఓకే రైస్ మిల్ కేటాయించడంతో అక్కడ కూడా అన్లోడ్ సమస్య ఉండడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం స్పందించి క్షేత్రస్థాయిలో కేంద్రాలను పర్యటించి తూకం మేసిన బస్తాలను మిల్లులకు తరలిస్తే మిగతా రైతులకు ధాన్యం నిల్వ చేసుకునే అవకాశం ఉంటుందని రైతులు చెబుతున్నారు. తమ బాధలను పట్టించుకోని ధాన్యాన్ని త్వరగా మిల్లులకు తరలించాలని రైతులు కోరుతున్నారు