రాయపోల్,మే 21 : అకాల వర్షానికి మండల కేంద్రంలోని ఐకెపి కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసి ముద్దయింది. బుధవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి ధాన్యం తడిసిపోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. కొనుగోలు కేంద్రానికి భారీగా ధాన్యం రావడంతో ఐకెపి అధికారులు లారీల్లో ధాన్యాన్ని తరలించినప్పటికి అకాల వర్షం రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
కాగా, విషయం తెలుసుకున్న ఐకెపి ఎపిఎం కిషన్, మండల ఆర్ఐ రాజమౌళి కొనుగోలు కేంద్రంలోని తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. వెంటనే తూకం వేసి లారీల ద్వారా ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని ఐకెపి సిబ్బందికి ఆదేశించారు. అకాల వర్షాలు ఉన్నందున మ్యాచర్ వచ్చిన పరిధాన్యాన్ని ఆలస్యం చేయకుండా తొందరగా తరలించే విధంగా ఐకెపి సిబ్బంది తగిన చర్యలు తీసుకోవాలని వారు ఆదేశించారు.