హుజూరాబాద్ టౌన్, జూన్ 08 : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలని మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ గందె రాధిక పిలుపునిచ్చారు. ఆదివారం బడిబాట కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి 6వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో సుశిక్షితులైన, అనుభవం కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారని, అన్నిరకాల వసతులు ఉన్నాయని తెలిపారు. పాఠశాలలో సువిశాలమైన క్రీడా మైదానం, సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూంలు, విటమిన్ గార్డెన్ అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
వీటితో పాటు ఉచితంగా పుస్తకాలు, యూనిఫాం, బూట్లు, మధ్యాహ్న భోజనం వంటి సదుపాయాలు అందుతున్నాయని తెలిపారు. అంతేకాకుండా సాంస్కృతిక కార్యక్రమాలు, విజ్ఞాన యాత్రలు, పోటీ పరీక్షలు, బాలికలకు కరాటే శిక్షణ తో పాటు హాకీ, కబడ్డీ అసోసియేషన్ల ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని. అందుచేత విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.