రాయపోల్, ఎప్రిల్ 14 : డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర జయంతిని పురస్కరించుకొని రాయపోల్ మండల కేంద్రంలో 41వ కుంజర యాత్రలో భాగంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. రాయపోల్ గ్రామపంచాయతీ, సిద్దిపేట జిల్లా అభివృద్ధి, సమన్వయ దిశా కమిటీ ఆధ్వర్యంలో విమలాకర్ ఫౌండేషన్, కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ సంయుక్తంగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని సుమారు 250 మందికి వైద్య సేవలు అందించారు.
ఉచిత వైద్య పరీక్షల్లో భాగంగా రక్త పరీక్షలు, అల్ట్రాసౌండ్ స్కానింగ్, 2డీ ఈకో, గుండె, మూత్రపిండాలు, కాలేయం, క్యాన్సర్ సంబంధిత పరీక్షలు నిర్వహించారు. మామూలుగా.. రూ. 20 వేలు ఖర్చు అయ్యే ఈ వైద్య పరీక్షలను ఉచితంగా చేశారు. డాక్టర్ విమలాకర్ రెడ్డి నేతత్వంలోని వైద్య బృందం ప్రజలకు సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య పరిస్థితులపై సూచనలు, సలహాలు అందించింది.

ఈ సందర్భంగా జిల్లా దిశా కమిటీ సభ్యులు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామాల్లో స్వచ్ఛంద సంస్థలు ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు మరింతగా నిర్వహించి పేద ప్రజలకు తోడ్పాటు అందించాలని సూచించారు. అలాగే ప్రజలు ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండి, చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడే వైద్యులను సంప్రదించాలని కోరారు.
డాక్టర్ విమలాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ జీర్ణకోశ వ్యాధులు, క్యాన్సర్ వంటి తీవ్రమైన రోగాలను ముందుగానే గుర్తించే పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని ఆయన పేర్కొన్నారు.
ఉచిత వైద్య శిబిరంలో డాక్టర్ విమలాకర్ ఫౌండేషన్ వైద్య బృందం, టెక్నీషియన్లు, రాయపోల్ గ్రామ సర్పంచ్ మాసంపల్లి రాజు, ఉపసర్పంచ్ అనుమంతు రాజు, వార్డు సభ్యులు, జిల్లా దిశా కమిటీ సభ్యులు రవీందర్ రెడ్డి, ప్రోగ్రాం కోఆర్డినేటర్ గుర్రం తులసీదాస్, తదితరులు పాల్గొన్నారు.