చేగుంట, మార్చి 11: పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ రైతు రక్షణ సమితి మెదక్ జిల్లా అధ్యక్షుడు పత్రాల యాదగౌడ్, జిల్లా గౌరవ అధ్యక్షుడు అక్కమొల్ల మైసయ్యయాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు మాచునూరి శ్రీశైలం యాదవ్, జిల్లా కార్యదర్శి మామిడి నర్సారెడ్డి కోరారు. చేగుంట మండలం అనంతసాగర్, రుక్మాపూర్, నార్సింగి మండల పరిధిలోని నర్సంపల్లి పెద్దతండా, జామ్లా తండా, నార్సింగిలో ఎండి పోయిన వరి, మొక్కజొన్న పంటలను, ఎండిపోయిన బోరుబావులను సోమవారం స్థానిక రైతులతో కలిసి వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాలకు చెందిన రైతులు ఎండి పోయిన పంటలను చూపుతూ తమ గోడును వెల్లబోసుకున్నారు.
రైతు రక్షణ సమితి నాయకులు మాట్లాడుతూ రైతులు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టి వ్యవసాయం సాగుచేస్తే, బోరుబావుల్లో నీరు అడుగంటి పోవడంతో వేసిన పంటలు పూర్తిగా ఎండిపోయాయన్నారు. మేకలకు, పశువులకు మేతగా మారినట్లు తెలిపారు. ప్రభుత్వం స్పందించి పంట నష్టం అంచనా వేసి రైతులను ఆదుకోవాలని కోరారు. వారివెంట చౌడం నరేందర్, ఎ.అశోక్‌రెడ్డి, వజ్జరాజు, మాజీ సర్పంచ్ చత్రీయనాయక్, బిక్యానాయక్, భాషనాయక్, రైతులు ఉన్నారు.