పాపన్నపేట, మార్చి 9: మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గమ్మ జాతర కొనసాగుతున్నది. రెండోరోజు శనివారం ఆలయం భక్తజన సంద్రమైంది. జాతరలో కీలక ఘట్టమైన బండ్ల ఊరేగింపు అట్టహాసంగా జరిగింది. ఆనవాయితీ ప్రకారం పాపన్నపేట సంస్థానాధీశుల బండి ముందు, మిగిలిన బండ్లు దాన్ని అనుసరించాయి. ఆలయం వద్ద శుక్రవారం రాత్రి మహాశివరాత్రి సందర్భంగా కళాబృందాలతో వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. వీటిని వేలాది మంది భక్తులు తిలకించారు. మహా శివరాత్రి ఉపవాస దీక్షలు పట్టిన భక్తులు ఉదయం మంజీరా నదిలో స్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకొని ఉపవాస దీక్షలు విడిచారు. శనివారం అమ్మవారికి పెద్దఎత్తున బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అమ్మవారి ఆలయం విద్యుత్ కాంతులతో ధగధగలాడింది. ఆదివారం రథోత్సవం వైభవంగా నిర్వహిస్తారు. బండ్ల ఊరేగింపు సందర్భంగా తొక్కిసలాట జరుగకుండా పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఏడుపాయల ఆలయ చైర్మన్ బాలాగౌడ్, మెదక్ డీఎస్పీ డాక్టర్ రాజేశ్, ఆలయ ఈవో మోహన్‌రెడ్డి, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.