జగదేవ్పూర్ మార్చి 14 : అనుమానాస్పద స్థితిలో వృద్ధ దంపతులు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం తీగుల్ గ్రామంలో సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన స్వర్గం సత్యనారాయణ(65), స్వర్గం బాలమణి(60) దంపతులు. వీరికి పిల్లలు లేకపోవడంతో బంధువులకు చెందిన కూతురుని దత్తత తీసుకొని చదివించి 3ఏండ్ల క్రితం వివాహం జరిపించారు.
సత్యనారాయణ దంపతులిద్దరు గ్రామంలోనే బీడీలు చుట్టుకుంటూ జీవిస్తున్నారు. సోమవారం ఉదయం 8 గంటలు అయినా సత్యనారాయణ ఇంటి తలుపులు తెరవకపోవడంతో చుట్టుపక్కల వారు వచ్చి చూశారు. తలుపు గడియ రాకపోవడంతో వెనుకాల ఉన్న మరో గడియ తీసి చూడగా అప్పటికే దంపతులిద్దరు గదిలో అనుమానాస్పదంగా విగత జీవులై పడిఉన్నారు.
వెంటనే సర్పంచ్ భానుప్రకాశ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఏసీపీ రమేశ్, గజ్వేల్ రూరల్సీఐ కమలాకర్, జగదేవ్పూర్, కుకునూర్పల్లె ఎస్ఐలు రాజు, పుష్పరాజ్ సంఘటనా స్థలాన్ని క్షణ్ణంగా పరిశీలించారు. మృతుల కూతురు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు.