హుస్నాబాద్ టౌన్, మార్చి 21: హుస్నాబాద్‌లో (Husnabad) ఏటా నిర్వహించే అంగడి వేలాన్ని కాంట్రాక్టర్లు బహిష్కరించారు. అంగడి ఆదాయం తగ్గిందని, వేలం పాట ధరను తగ్గించాలని డిమాండ్ చేశారు. ధరను తగ్గించాలని విజ్ఞప్తిచేసినా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. శుక్రవారం ఉదయం హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో పశువుల అంగడి వేలం నిర్వహించారు. వేలం పాటను రూ.కోటి 26 లక్షల 27 వేల 3 వందల రూపాయలతో ప్రారంభించారు. అయితే కాంట్రాక్టర్లు మాత్రం వేలంపాట ధరను తగ్గించాలని, రూ.50 లక్షల నుంచి పాట పాడుతామని స్పష్టంచేశారు. కాంట్రాక్టర్ల ప్రతిపాదనను నిరాకరించిన కమిషనర్ మల్లికార్జున గౌడ్.. మున్సిపల్ నిబంధనల ప్రకారమే వేలంపాటను నిర్వహిస్తామని, దానికి అనుగుణంగా పాల్గొనాలని సూచించారు.
కాంట్రాక్టర్లు మాత్రం తాము ఇదివరకే వినతి పత్రం ఇవ్వడం జరిగిందని చుట్టుపక్కల నూతనంగా అంగళ్లు ప్రారంభం కావడంతో హుస్నాబాద్ అంగడి ఆదాయం భారీగా తగ్గిందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని అంగడివేలంను తగ్గించాలని కమిషనర్‌కు విన్నవించారు. వేలంపాట ధరను ఎట్టి పరిస్థితిలో తగ్గించేలేమని, ఏవైనా అభ్యంతరాలు ఉంటే వినతిపత్రం ద్వారా తెలియజేస్తే ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తామన్నారు. అయినప్పటికీ కాంట్రాక్టర్లు వేలంపాటను రూ.50 లక్షల నుంచే పాడుతామంటూ మరోమారు స్పష్టం చేయడంతో అధికారులు ససేమిరా అన్నారు.
తాను సూచించిన వేలం పాట ధర పాడాలని మళ్లీ వేలం ప్రారంభించగా కాంట్రాక్టర్లు తాము వేలంపాటలో పాల్గొనడం లేదంటూ బహిష్కరించి వెళ్లిపోయారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున గౌడ్ మాట్లాడుతూ శుక్రవారం జరిగిన వేలం పాట విషయాన్ని జిల్లా అధికారులకు నివేదించి వారి సూచనల మేరకు మరో మారు వేలం పాట నిర్వహిస్తామన్నారు.