సిద్దిపేట, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మెదక్ నియోజకవర్గ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ వంటేరి యాదవరెడ్డిని గెలిపించిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటామని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు అన్నారు. మెదక్ ఎమ్మెల్సీ స్థానం నుంచి గెలుపొందిన యాదవరెడ్డి మంగళవారం హైదరాబాద్‌లోని అరణ్య భవన్లో మంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బక్కి వెంకటయ్య, గజ్వేల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. టీఆర్ఎస్ మెదక్ ఎమ్మెల్సీ అభ్యర్థికి 754, అదనంగా మరో 8 ఓట్లు కలుపుకొని, మొత్తం 762 ఓట్లు సాధించామన్నారు. సీఎం నిర్ణయం మేరకు ఏకతాటిపై నిలిచి అద్భుత విజయం సాధించేందుకు కృషి చేసిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరికీ ధన్యవాదాలు తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులను అడ్డుపెట్టుకుని ఎన్నికల వేళ టీఆర్ఎస్ను దెబ్బతీయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రలోభాలకు తెరతీసిందన్నారు. ఓడించి ఆ పార్టీకి స్థానిక ప్రజాప్రతినిధులు తగిన గుణపాఠం చెప్పారన్నారు. వ్యవసాయం, రైతుల గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ లేదని ప్రశ్నించారు. రైతు సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు.
స్థానిక సంస్థలను బీజేపీ నిర్వీర్యం చేసింది..
వడ్ల కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. అకాల వర్షాలతో కొన్నిచోట్ల ధాన్యం తడిస్తే దాన్ని రాజకీయం చేయాలని కాంగ్రెస్ ప్రయత్నించడం సిగ్గుచేటని మంత్రి విమర్శించారు. సంగారెడ్డి, మెదక్‌లో ఇప్పటికే 95 శాతం ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయని తెలిపారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ వేతనాలు పెంచింది టీఆర్ఎస్ పార్టీనేనని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు ఇస్తున్నట్లు తెలిపారు. స్థానిక సంస్థలకు 15 ఆర్థిక సంఘం ద్వారా ఇచ్చే నిధులను బీజేపీ తగ్గిస్తే, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అంతకు సమానమైన నిధులను కలిపి ఆ మొత్తాన్ని గ్రామ పంచాయతీలకు అందజేస్తున్నదని చెప్పారు. మండల పరిషత్, జిల్లా పరిషత్‌లకు రూ.500 కోట్లను ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చిందన్నారు. కానీ, కేంద్రం మాత్రం ఇచ్చే నిధులు తగ్గించి మండల పరిషత్ జడ్పీలను నిర్వీర్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.