న్యూఢిల్లీ: టీ20 వరల్డ్‌కప్‌లో ఆదివారం ఇండియాతో జరిగే మ్యాచ్‌లో ఆడనున్నట్లు పాకిస్థాన్ ప్రకటించింది. అయితే ఈ టోర్నమెంట్ నుంచి వైదొలగిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుపై ఎటువంటి పెనాల్టీ విధించడం లేదని అంతర్జాతీయ క్రికెట్ మండలి(International Cricket Council) చెప్పింది. ఇక 2031లో జరిగే ఐసీసీ టోర్నీకి ముందే బంగ్లాదేశ్‌లో ఓ టోర్నమెంట్‌ను నిర్వహించేందుకు ఐసీసీ అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇటీవల బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడి నేపథ్యంలో.. ఐపీఎల్లో ఆడే బంగ్లా బౌలర్‌ను తొలగించడంతో.. ఇండియా వేదికగా జరిగే మ్యాచ్‌లను ఆడబోనని బంగ్లా చెప్పింది. దీంతో ఆ దేశాన్ని వరల్డ్‌కప్ టోర్నీ నుంచి తప్పించారు. ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్కు అవకాశం ఇచ్చారు. ఇక ఆ అంశంలో బంగ్లాకు అండగా నిలిచిన పాకిస్థాన్ తన వంతుగా ఇండియాతో జరిగే మ్యాచ్‌ను ఆడబోనని తీర్మానించింది. కానీ ఐసీసీ వార్నింగ్.. శ్రీలంక, బంగ్లా ప్రయత్నాల వల్ల ఇండియాతో ఆడేందుకు మళ్లీ పాకిస్థాన్ అంగీకరించింది. పీసీబీ, బీసీబీతో చర్చలు చాలా ఓపెన్‌గా, నిర్మాణాత్మకంగా జరిగాయని ఐసీసీ తన ప్రకటనలో చెప్పింది.
ఇండియాతో ఆడేందుకు వాస్తవానికి పాకిస్థాన్ కొన్ని డిమాండ్లు చేసింది. వాటిలో కొన్నింటిని ఐసీసీ ఆమోదించింది. కొన్నింటిని అసలు పట్టించుకోలేదు. అవేంటో చూద్దాం. బంగ్లాదేశ్‌పై ఆర్థికపరమైన భారాన్ని మోపరాదు అని, ఫైన్ వేయరాదు అని కోరారు. పూర్తి స్థాయి ఐసీసీ ఆదాయం బంగ్లాకు ఇవ్వాలని పాక్ కోరింది. దీనికి ఐసీసీ స్పందిస్తూ బంగ్లా క్రికెట్ బోర్డుకు జరిమానా విధించడం లేదన్నది. నష్టపరిహారంగా ఓ ఐసీసీ ఈవెంట్‌ను బంగ్లాలో నిర్వహించాలని కోరారు, దానికి ఐసీసీ బదులిస్తూ.. తర్వాత క్రమంలో అండర్-19 వరల్డ్‌కప్ నిర్వహించనున్నట్లు చెప్పింది. ఇక మూడవ డిమాండ్‌గా ఇండోపాక్ ద్వైపాక్షిక సిరీస్‌ను పునరుద్దరించాలని కోరింది. పీసీబీ చేసిన అభ్యర్థనను ఐసీసీ తోసిపుచ్చింది. ద్వైపాక్షిక సిరీస్‌లు తమ ఆధీనంలో ఉండవని ఐసీసీ చెప్పింది. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ సైకిల్ సమయంలో కూడా ఆ అంశం తమ పరిధిలో ఉండదని ఐసీసీ వెల్లడించింది.
ఇండియా, పాక్, బంగ్లా దేశాలతో ట్రై సిరీస్ నిర్వహించాలని పీసీబీ కోరింది. ఆ ప్రతిపాదనను ఐసీసీ తిరస్కరించింది. ఈ ప్రతిపాదన తమ అధికారం పరిధిలో లేనట్లు ఐసీసీ చెప్పింది. 2026లో బంగ్లాదేశ్‌లో ఇండియా జట్టు టూరు చేయాలని పీసీబీ కోరింది. ఈ అంశంలో జోక్యం చేసుకునేందుకు ఐసీసీ నిరాకరించింది. టూర్లు అనేవి ద్వైపాక్షిక నిర్ణయాలని తేల్చింది.