చేర్యాల : అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారాలు, అమలుకు సాధ్యం కాని హామీలిచ్చిందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి (MLA Palla Rajeshwar Reddy) అన్నారు. గురువారం చేర్యాల పట్టణంలో చేర్యాల టౌన్, చేర్యాల, కొమురవెల్లి మండలాల బీఆర్ఎస్ కార్యకర్తలతో నిర్వహించిన కృతజ్ఞత సభలో ఆయన మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ (BRS) హయాంలో, ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) నేతృత్వంలో అనేక సంక్షేమ పథకాలు పేదలకు అందాయని తెలిపారు.
అధికార పక్షం బీఆర్ఎస్ కార్యకర్తలపై వేధింపులకు గురిచేస్తే సహించబోమని అన్నారు. ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. తన పై ఓడిపోయిన వ్యక్తులు యూట్యూబ్ ఛానళ్ల ద్వారా తనతో పాటు కుటుంబం, విద్యా సంస్ధల పై అసత్య ప్రచారాలు చేస్తున్నారని వారి పై కోర్టులో దావా వేసినట్లు తెలిపారు. రానున్న ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 12 సీట్లు సాధించేందుకు లక్ష్యంగా ముందుకు సాగుతుందని, భువనగిరి ఎంపీ స్ధానం పై గులాబీ జెండా ఎగురవేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.