నంగునూరు : మనం కట్టుకున్న కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం పెత్తనం చేయాలని చూస్తున్నది. దొడ్డు రకం వడ్లు, కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర పెత్తనం ఏంటో తేల్చుకునేందుకే సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లారని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఆదివారం ఆయన నంగునూరు మండలం పాలమాకులలో 53 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు, ఇటీవల కురిసిన వర్షాలకు కూలిన ఇండ్లకు నష్టపరిహారంగా 77 మందికి చెక్కులు, వాటర్ షెడ్ నుంచి టార్పాలిన్ కవర్లు 699 మందికి, బ్యాటరీ స్ప్రేయర్లు 37 మందికి, తైవాన్ స్ప్రేయర్లు 9 మందికి పంపిణీ చేసి మాట్లాడారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం రైతులకు ఎంతగానో మేలు చేస్తున్నదని, వానకాలం, యాసంగికి పెట్టుబడి సాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మనదని కొనియాడారు. గత ప్రభుత్వాలు రైతులను పట్టించుకోలేదని విమర్శించారు. మండలంలోని దర్గపల్లిలో రూ.7 కోట్లతో వారం, పదిరోజుల్లోనే హైలెవల్ బ్రిడ్జి పనులు ప్రారంభించుకుం దామన్నారు. హన్మకొండ నుంచి సిద్దిపేట మీదుగా రామాయంపేట వరకు జాతీయ రహదారి వస్తుందని, వర్షం కురిస్తే ఈ దారిపై వెళ్లేందుకు ఇబ్బందులు ఉన్నాయంటూ.. బస్వాపూర్ బ్రిడ్జి పునరుద్ధరణ చేపట్టి హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. పాలమాకులలోనూ రోడ్డుకు ఇరువైపులా ఫుట్‌పాత్‌తోపాటు డివైడర్ మధ్యలో ఫ్లడ్ లైట్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
రైతులు పంట మార్పిడి చేయాలి
యాసంగిలో కేంద్రం దొడ్డు రకం వడ్లు కొనమని అంటుంది.. మన దేశానికి అవసరమైన పంట దినుసులు, నూనెలను దిగుమతి చేసుకుంటున్నాం.. వాటికి బదులుగా ఇక్కడే ఆయిల్‌పామ్, పప్పు దినుసుల పంటలు సాగు చేస్తే రైతులకు ఇబ్బందులు ఉండవని మంత్రి హరీశ్‌రావు అన్నారు. రైతులందరూ ఆయిల్‌పామ్, మల్బరీ సాగు పై దృష్టి సారించాలన్నారు. ఇప్పటికే నంగునూరులో వెయ్యి ఎకరాల్లో పామాయిల్ తోటలు పెట్టామన్నారు. సీఎం కేసీఆర్ దయతో ఇప్పుడిప్పుడే మెరుగైన పంటలను రైతులు పండిస్తుంటే దొడ్డు రకం వడ్లు కొనమని కేంద్ర ప్రభుత్వం అంటుందన్నారు. 70 ఏండ్లలో జరగని అభివృద్ధిని సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఏడేండ్లలో చేసి చూపిందన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజారాధాకృష్ణశర్మ, ఆర్డీవో అనంతరెడ్డి, జడ్పీటీసీ తడిసిన ఉమ, ఏఎంసీ చైర్మన్ రాగుల సారయ్య, మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు రమేశ్, మహిపాల్‌రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు కిష్టారెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ సోంరెడ్డి, స్థానిక సర్పంచు కుమారస్వామి, ఎంపీటీసీ తులసీ పరమేశ్వర్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.