చేగుంట, మే 10: గ్యారెంటీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చిన తర్వాత గాలికి వదిలేసిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నార్సింగిలో మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి దుబ్బాక ఎమ్మెల్యే మద్దతుగా చేగుంట, నార్సింగి మండలాల్లో రోడ్డుషో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ మెదక్ ఎంపీ గడ్డ బీఆర్ఎస్ అడ్డా అని, నెలకు 4వేల పింఛన్, కల్యాణలక్ష్మి తులం బంగారం ఇస్తానని ఆరు గ్యారెంటీలు ఎక్కడ అమలవుతున్నాయన్నారు. ఎడ్లు, బండ్లు, నెలకు రెండు వేల జీవనభృతి, ఉచిత వైద్యం చేస్తానని మాయమాటలు చెప్పి మోసం చేసిన రఘునంధన్రావును దుబ్బాక ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పారన్నారు. మెదక్ గడ్డ మీద గులాబీ జెండా మళ్లీ రెపరెప లాడుతుందన్నారు. తాను ఎంపీగా రెండుసార్లు గెలిపించారని, తాను మెదక్ కోసం ఎంతో అభివృద్ధి చేశానన్నారు. మల్లన్నసాగర్, కొండ పోచమ్మ సాగర్ ద్వారా సాగునీళ్లు తెచ్చుకున్నామని, తెలంగాణ అభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యమవుతందున్నారు. దుబ్బాక అభివృద్ధిలో వెంకట్రామిరెడ్డి కీలక పాత్ర పోషిస్తారన్నారు.
మాయగాళ్లను దుబ్బాక ప్రజలు నమ్మరు
ప్రజా క్షేత్రంలో గెలిచే సత్తాలేకనే తనపై బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు దుష్ప్రచారం చేస్తున్నాడని మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్సీ పి.వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. కలెక్టర్‌గా తన పనితీరు ప్రజలకు తెలుసని, ఓర్వలేని రఘునందన్ కేంద్రంలో వారి ప్రభుత్వం ఉందనే ఉద్దేశంతో తనపై బురుద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మాయమాటలు చెప్పేవాళ్లను దుబ్బాక ప్రజలు నమ్మబోరని, వాస్తవాలు చెప్పే వారికే పట్టం కట్టాలని వెంకట్రామిరెడ్డి కోరారు.
ఎమెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరిక
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి సమక్షంలో నార్సింగి మండల కేంద్రంలోని వివిధ పార్టీలకు చెందినవారు బీఆర్ఎస్లో చేరారు. మాజీ వార్డు సభ్యురాలు నల్లపోచమ్మ, కాట్లే సిద్దిరాములు, ఆర్ఎస్ శ్రీనివాస్ తదితరుల పార్టీలో చేరారు. కార్యక్రమంలో నార్సింగి పార్టీ మండల అధ్యక్షుడు మైలరాం బాబు, ఎంపీపీ చిందం సబీతరవీందర్, జడ్పీటీసీ బాణపురం క్రిష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ దొబ్బల సుజాతాశంకర్, ఎంపీటీసీ ఆకుల సుజాతామల్లేశంగౌడ్,పట్టణశాఖ అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, నాయకులు శ్రీపతిరావ్, మల్లేశంగౌడ్, సుధీర్‌గౌడ్, రాజు పాల్గొన్నారు.
చేగుంటలో బీఆర్ఎస్ భారీ రోడ్డు షో
చేగుంట మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రాంరెడ్డికి మద్దతుగా శుక్రవారం బీఆర్ఎస్ రోడ్డుషోను నిర్వహించారు. బస్టాండ్ నుంచి గాంధీ చౌరస్తా వరుకు భారీ ర్యాలీతో తరలివచ్చారు. కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి కోరారు. కార్యక్రమంలో నాయకులు, ప్రజప్రతినిధులు పాల్గొన్నారు.