దౌల్తాబాద్, ఆగస్టు 2: బేగంపేట గ్రామదేవత శ్రీ మహంకాళి అమ్మవారి బోనాల మహోత్సవాల్లో చేపట్టిన పొట్టేళ్ల బండి ఊరేగింపు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. గ్రామ సంప్రదాయాలను, సంస్కృతిని చిన్న వయసులోనే అలవర్చుకుంటూ చిన్నారులు స్వయంగా పొట్టేళ్ల బండిని తయారు చేసి భక్తిశ్రద్ధలతో ఊరేగింపుగా తీసుకెళ్లడం వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
సంప్రదాయ వస్త్రధారణలో చిన్నారులు “జై మహంకాళి అమ్మవారు” నినాదాలతో గ్రామ వీధుల గుండా పొట్టేళ్ల బండిని లాగుతూ ఆలయానికి చేరుకున్నారు. మహంకాళి అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తమ కుటుంబసభ్యులతో కలిసి అమ్మవారికి మొక్కులు చెల్లించారు. కొబ్బరికాయలు కొట్టి నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామంలో పాడిపంటలు సమృద్ధిగా పండాలని, సమయానికి వర్షాలు కురవాలని, పశుసంపద అభివృద్ధి చెందాలని, గ్రామ ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో జీవించాలని అమ్మవారిని వేడుకున్నారు. గ్రామంపై మహంకాళి అమ్మవారి కరుణాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు చిన్నారులు.
ప్రతి సంవత్సరం బోనాల పండుగ సందర్భంగా గ్రామదేవతకు బోనాలు సమర్పించడం, మొక్కులు తీర్చుకోవడం తమ పూర్వీకుల నుంచి వస్తున్న ఆనవాయితీ అని గ్రామస్తులు తెలిపారు. ఈ సంప్రదాయాన్ని భావితరాలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో చిన్నారులను కూడా ఈ వేడుకల్లో భాగస్వాములను చేస్తున్నామని పేర్కొన్నారు. పొట్టేళ్ల బండి ఊరేగింపును తిలకించేందుకు బేగంపేట, అప్పాయిపల్లి గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మహిళలు బోనాలు సమర్పించగా.. యువకులు, చిన్నారులు భక్తి గీతాలు, డప్పు వాయిద్యాల నడుమ ఊరేగింపులో పాల్గొన్నారు. చిన్నారుల భక్తి, ఉత్సాహం, సంప్రదాయాల పట్ల వారికున్న గౌరవం, ఆసక్తిని గ్రామస్థులు అభినందించారు.