స్టేషన్ చుట్టూరా కళా చిత్రాలు
చూపరులను ఆకట్టుకుంటున్న దృశ్యాలు
మనోహరాబాద్, ఫిబ్రవరి 25: తెలంగాణ రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుగా నిలువనున్న మనోహరాబాద్-కొత్తపల్లి పనులు వేగవంతమయ్యాయి. మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి వరకు 151 కిలో మీటర్ల రైలు మార్గం నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు మనోహరాబాద్ నుంచి గజ్వేల్, కొడకండ్ల వరకు 46.5 కిలోమీటర్ల దూరం వరకు రైల్వే పనులు పూర్తి దశకు చేరుకున్నాయి. ఇటీవల గజ్వేల్, కొడకండ్ల వరకు రైల్వే సేఫ్టీ అధికారులు ట్రయల్న్న్రు సైతం నిర్వహించారు. కాగా రైల్వే లైన్ పనులతో పాటు రైల్వే స్టేషన్లను సైతం ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. మనోహరాబాద్లో ఇదివరకే పాత రైల్వే స్టేషన్ ఉండగా దానికి ఆనుకుని మరో పెద్ద రైల్వే స్టేషన్ను అన్ని హంగులతో నిర్మించారు. విశాలమైన ఫ్లాట్ఫారం, కూర్చునేందుకు సిమెంట్ చైర్లు, అత్యాధునిక వసతులతో బుకింగ్ కౌంటర్, వాహనదారులకు పార్కింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. రైల్వేస్టేషన్ గదుల చుట్టూ తెలంగాణ సంస్కృతి ఉట్టి పడేలా కళా చిత్రాలను చిత్రీకరించారు. “అంతరించిపోతున్న పల్లె జీవన పద్దతులు నీళ్లు తోడటం, పిండి పట్టడం, బియ్యం చెరగడం, ముగ్గులు వెయ్యడం వంటి చిత్రాలు కండ్లకు కట్టినట్లు చిత్రీకరించారు. బతుకమ్మ పండుగ సంబురాలు, దసరా గంగిరెద్దుల ఆటలతో పాటు వరి నాటు వేయడం నుంచి కలవడం, కోత కొయ్యడం, వడ్లు నూర్పడం, కుప్పకొట్టడం, ఇంటికి ధాన్యాన్ని తరలించే దృశ్యాలు మనస్సును కట్టిపడేస్తున్నాయి. మరికొన్ని రోజుల్లోనే మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే లైన్ను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. దీంతో మండలంతో పాటు సమీప మండలాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.