మెదక్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): విద్యార్థి జీవితంలో పది, ఇంటర్ పరీక్షలు కీలకం. వారి బంగారు భవిష్యత్తుకు పునాదులు పడేది కూడా ఇక్కడే. మెదక్ జిల్లాలో పది, ఇంటర్ వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాల సాధించడంపై విద్యాశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందుకోసం యాక్షన్ ప్లాస్ సిద్ధం చేశారు. స్టడీ ప్లానింగ్, వారాంతపు పరీక్షలు నిర్వహిస్తున్నారు. చదువులో వెనుకబడిన పిల్లలను కనీస మార్కులతో గట్టెక్కించేలా చర్యలు తీసుకోవాలని అధికారులు సీఆర్పీ, పీజీటీలు, స్పెషల్ ఆఫీసర్లను ఆదేశించారు. ఈ మేరకు కేజీబీవీల్లో ఉత్తీర్ణతా శాతం పెంచేందుకు ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేసి అమలుకు శ్రీకారం చుట్టారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులతో పాటు వారాంతంలో గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు అధికారులు 100 రోజుల ప్రణాళిక తయారు చేశారు. యాక్షన్ ప్లాన్లో భాగంగా ఉదయం 5 నుంచి 5.30 గంటల వరకు ప్రైవేట్ టైమ్.. 5.30 నుంచి 7.30 వరకు సబ్జెక్ట్ ప్రిపరేషన్, 7.30 నుంచి 8.00 వరకు ఫ్రీ టైం, 8.30 నుంచి 9 వరకు బ్రేక్ ఫాస్ట్, 9 గంటలకి ప్రేయర్, 9.20 నుంచి 12.30 వరకు తరగతులు, 12.30 నుంచి 1.15 వరకు లంచ్, 1.30 నుంచి 4.30 వరకు సబ్జెక్టుల వారీగా తరగతులు, సాయం త్రం 4.30 నుంచి 5.15 వరకు స్నాక్స్, 5.15 నుంచి స్పోర్ట్స్, 6.20 నుంచి 7 గంటల వరకు డిన్నర్, రాత్రి 7 నుంచి 10.30గంటల వరకు ఇంటర్మీడియెట్ విద్యార్థులతో కలిపి స్టడీ అవర్ ఉంటుంది.
మెదక్ జిల్లాలో 15 కేజీబీవీలు ఉండగా, వీటిల్లో 510 మంది పదో తరగతి, 282 మంది ఇంటర్ మొదటి సంవత్సరం, 192మంది రెండో సంవత్సరం చదువుతున్నారు. వీరిలో కొంతమంది విద్యార్థులను కేజీబీవీల్లో పనిచేసే స్పెషల్ ఆఫీసర్లతో పాటు సీఆర్టీ, పీజీటీలు దత్తత తీసుకొని చదివిస్తున్నారు. వారు ఎలా చదువుతున్నారు?. ఏఏ సబ్జెక్టుల్లో వెనుకబడి ఉన్నారనే అంశాలను పరిశీలిస్తారు. ఎక్కడ ఇబ్బందులన్నాయో గుర్తించి వాటిని అధిగమించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. కేజీబీవీల జీఈసీవో సుకన్య ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు.
ఈ ఏడాది వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేస్తున్నాం. ప్రతి రోజూ ఒకటి రెండు కేజీబీవీలను సందర్శిస్తూ ప్రత్యేక సూచనలు, సలహాలు ఇస్తున్నాం. ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులతో పాటు వారాంతంలో గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తున్నాం. వీలైనంత ఎక్కువ మంది విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించేలా చర్యలు తీసుకుంటున్నాం.
పది, ఇంటర్లో మంచి ఫలితాల సాధనకు కృషి చేయాలి. కేజీబీవీల్లో ప్రణాళిక పక్కాగా అమలు చేయాలి. జిల్లాలోని 15 కేజీబీవీల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా స్పెషల్ ఆఫీసర్లు, సీఆర్టీలు, పీజీటీలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేసిన సిబ్బంది, అత్యుత్తమ మార్కులు పొందిన విద్యార్థినీ, విద్యార్థులను కలెక్టర్ చేతుల మీదుగా సన్మానిస్తాం.