మెదక్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): మెదక్ గడ్డ… గులాబీ అడ్డా.. మళ్లీ బీఆర్ఎస్ గెలువబోతుందని, 25 ఏండ్లల్లో మెదక్‌లో గులాబీ జెండా ఎగురుతున్నదని, వేరే జెండా ఎగురలేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. గురువారం మెదక్‌లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి నామినేషన్ వేసిన సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ… ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ అంటే ఎండ కూడా భయపడుతున్నదన్నారు.
కేసీఆర్ మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. కలెక్టరేట్ నిర్మించడంతోనే రేవంత్‌రెడ్డి మెదక్‌కు వచ్చి నామినేషన్ వేశారని పేర్కొన్నారు. బీహెచ్ఈఎల్ 1952లో ఏర్పాటైతే 1980లో ఇందిరాగాంధీ మెదక్ నుంచి ఎంపీగా గెలిచిన తర్వాత ఏర్పాటు చేశారని రేవంత్‌రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉన్నదన్నారు. మెదక్ అభివృద్ధి గురించి మాట్లాడే హకు రేవంత్‌కు లేదన్నారు. మెదక్‌లో అందంగా నాలుగు లేన్ల రహదారి చేసింది కేసీఆర్ అని అన్నారు. పేగులు మెడలో వేసుకుంటా అని రేవంత్‌రెడ్డి మాట్లాడడం ఏమిటని, పేగులు మెడలో వేసుకునేది రాక్షసులు మాత్రమే అన్నారు. సీఎం స్థాయిని తగ్గించుకొని మాట్లాడుతూ సీఎం కుర్చి ఇజ్జత్ తీస్తున్నారని ఆరోపించారు.
వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలుచేసి బాండ్ పేపర్ మీద రాసి బాండ్ పేపర్ పరువు తీశారన్నారు. ఇప్పుడు కొత్తగా దేవుళ్లను రాజకీయాలకు వాడుతున్నారని విమర్శించారు. నువ్వు ఎవరి మీద ఒట్టు పెట్టినా నిన్ను ప్రజలు నమ్మరని హరీశ్‌రావు చెప్పారు. ఆరు గ్యారెంటీలు అమలు చేశానని చెబుతున్నావ్… ఒక గ్యారెంటీ అయినా అమలు అయ్యిందా అని ప్రశ్నించారు. మహిళలకు రూ.2500 అయ్యిందా, రూ.500లకు గ్యాస్ సిలిండర్ ఇచ్చారా… రూ.2000 పింఛన్, రూ.4వేలు అయ్యిందా.. కల్యాణలక్ష్మితో తులం బంగా రం ఇచ్చారా అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సూటిగా రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు.
నన్ను రెండుసార్లు మూడు లక్షల మెజార్టీతో గెలిపించారని, వెంకట్రామిరెడ్డి నాలుగు లక్షల మెజార్టీతో గెలవడం ఖాయమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. దుబ్బాకలో మాయమాటలు చెప్పిన రఘునందన్‌రావును ప్రజలు చిత్తుగా ఓడించారని చెప్పారు. అదే పరిస్థితి ఎంపీ ఎన్నికల్లో కూడా పునరావృతం అవుతుందన్నారు.
తెలంగాణ ప్రదాత కేసీఆర్ ఆశీస్సులతో మెదక్‌లో ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నానని, ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులంతా అండగా నిలవాలన్నారు. దైవసాక్షిగా చెబుతున్న నెల రోజుల్లో రూ.100 కోట్లతో ట్రస్టు ఏర్పాటు చేస్తానని, కోచింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి నిరుపేద యువతీ, యు వకులకు అండగా నిలుస్తానన్నారు. కలెక్టర్‌గా ఖ్యాతి ఇచ్చిన మెదక్ గడ్డ ప్రజలు, సేవ చేయడానికి అవకాశం ఇవ్వాలని వెంకట్రామిరెడ్డి కోరారు. ప్రతి నియోజకవర్గంలో ఒక ఫంక్షన్ హాల్ నిర్మించి పేదలకు అందిస్తామన్నారు. మండుటెండలో తరలివచ్చిన అశేష జనవాహినికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
నర్సాపూర్ నియోజకవర్గంలోని హల్దీవాగులోకి నీళ్లు పా రించిన ఘనత కేసీఆర్, హరీశ్‌రావులకు దకుతుందని ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నా రు. కేసీఆర్ హయాంలో ఒక ఎకరా పొలం ఎండిపోలేదని, కాంగ్రెస్ రాగా నే 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయన్నారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అటకెకాయని, ఉన్న రైతుబంధు, 24 గంటల కరెంటు, తాగునీళ్లు కూడా అందడం లేవన్నా రు. కేసీఆర్, బీఆర్ఎస్తోనే మనందరికీ శ్రీరామ రక్ష అని పేరొన్నారు.
ఎంపీ ఎన్నికల్లో ఘన విజయం అందిస్తామని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించి ఏమి కోల్పోయామో మెదక్ ప్రజలు గమనించారని, 10 ఏండ్లలో మెదక్‌లో చేసిన అభివృద్ధి కనిపించలేదా అని ప్రశ్నించారు. మెదక్ జిల్లా, మెదక్‌కు రైలు, రోడ్డు విస్తరణ, సాగు, తాగునీటి సౌకర్యాలు కనిపిస్తలేవా రేవంత్‌రెడ్డి అని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో నిర్మించిన రోడ్డుపై వెళ్లారని, కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ వేశారని రేవంత్‌రెడ్డికి గుర్తుచేశారు. మెదక్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని, మంజూరైన కోట్లాది రూపాయల నిధులు రద్దు చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు.