సిద్దిపేట/ చిన్నకోడూరు, ఆగస్టు 6 : వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో అనంతగిరి, రంగనాయకసాగర్లను కాళేశ్వరం జలాలతో నింపి రైతాంగాన్ని ఆదుకోవాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మె ల్యే తన్నీరు హరీశ్‌రావు ఇటీవల నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి లేఖ రాసిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వ యంత్రాంగంలో కదలిక వచ్చింది. స్పందించిన ప్రభుత్వం అనంతగిరి రిజర్వాయర్ నుంచి నీటిని ఎత్తిపోసే ప్రక్రియను ప్రారంభించింది.
మంగళవారం రెండు మోటర్లను ఆన్‌చేయడంతో గోదావరి జలాలు రంగనాయకసాగర్‌లోకి పరుగులు పెట్టాయి. 3 టీఎంసీల సామర్థ్యంగల రంగనాయకసాగర్‌లో ఇప్పటికే 0.68 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. రెండు పంపుల ద్వారా 6600 క్యూసెక్కుల నీటిని ప్రాజెక్టులోకి ఎత్తిపోస్తున్నారు. 24గంటల పాటు పంపులు నిరాటంకంగా నడిస్తే 0.25టీఎంసీల నీరు రిజర్వాయర్‌లోకి చేరనున్నది.
శనివారం వరకు నీటిని ఎత్తిపోసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, అప్పటి వరకు నీటి లభ్యతను బట్టి గోదావరి జలాలు ఎత్తిపోయనున్నట్లు అధికారులు తెలిపారు. రంగనాయకసాగర్‌ను గోదావరి జలాలతో నింపుతుండటంతో ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలోని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రంగనాయకసాగర్‌కు గోదావరి జలాలు పరుగులు పెడుతుండటంతో వాటిని చూసేందుకు పర్యాటకులు వస్తున్నారు.