కొమురవెల్లి, మే 31 : చికెన్ ధరలు అమాంతం పెరిగాయి. ఎండకాలం వేడిమితో చికెన్‌ను చాలా మంది తక్కువగా తింటారు. దీంతో చికెన్ ధరలు తగ్గాల్సి ఉంటుంది కానీ, గత నెలతో పోలిస్తే ప్రస్తుతం చికెన్ ధరలు పెరిగాయి. ప్రస్తుతం స్కిన్లెస్ చికెన్ కిలో రూ.320 చేరి భోజనప్రియులకు చుక్కలు చూపిస్తోంది. కొన్ని వారాలుగా చికెన్ ధరలు భారీగా పెరిగాయి. కోళ్లకు వేసే దాణా ధరలు పెరగడం.. పెండ్లిళ్లు, శుభకార్యాలు ఎక్కువగా ఉండటం వల్లనే ధరలు పెరుగుతున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. వేసవిలో కోళ్ల లభ్యత స్థానికంగా తక్కువగా ఉండటం, దాణాను ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని నిర్వాహకులు పేర్కొంటున్నారు.
ధరల పెరగుదలకు కారణాలివే..
వేసవిలోనూ..
మండలం వ్యాప్తంగా రోజుకు దాదాపు 15 క్వింటాళ్ల చికెన్ వినియోగిస్తున్నట్లు సమాచారం. ఆదివారం పండుగ వేళల్లో రెట్టింపు స్థాయిలో అమ్మకాలు జరుగుతాయని అంచనా. పెండ్లిళ్ల సీజన్ కావడంతో అంచనాలకు మించి వ్యాపారం కొనసాగుతున్నది. సంవత్సరం పొడవునా చికెన్ వ్యాపారం జోరందుకున్నా… వేసవిలో మాత్రం మందకొడిగా ఉండేవి. దాంతో రేట్లు కూడా తగ్గుముఖం పడుతుంటాయి. కానీ, ప్రస్తుతం వేసవి ముగుస్తున్నా, ఎండల తీవ్రత పెరుగుతున్నా చికెన్ ధరలు పై పైకి పెరుగుతున్నాయి.
స్కిన్లెస్ చికెన్ ధర కిలోకు రూ.320 ఉండగా విత్ స్కిన్‌తో రూ.300 ఉంది. లైవ్‌కోడి ధర కిలోకు రూ.200, బోన్‌లెస్ చికెన్ ధర రూ.520 పలుకుతోంది.
తప్పదు తినాల్సిందే..
కరోనా నేపథ్యంలో ప్రోటీన్లు ఉన్న ఆహారం తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వారంలో(మెనూలో) రెండు సార్లు చికెన్ ఉండేవిధంగా ప్లాన్ చేసుకున్నాం. ఎండకాలంలో చికెన్ ధర విపరీతంగా ఉంది. రేటు పెరిగినా చికెన్ తినాల్సిందే తప్పదు.
-పొట్లచెరువు బాబు, కొమురవెల్లి
ధర పెరిగినా వినియోగం తగ్గడం లేదు
కోడి ధరలు బాగా పెరిగాయి. కొన్ని వారాలుగా పరిస్థితి ఇలాగే ఉంది. డిమాండ్‌కు తగినన్ని కోళ్లు అందుబాటులో లేకపోవడమే ఇందుకు కారణం. వ్యాపారాలు బాగానే ఉన్నాయి. ప్రజలు చికెన్‌కు అలవాటు పడ్డారు. చికెన్ ధరలు పెరిగినప్పటికీ వినియోగం తగ్గడం లేదు.
-గౌలికార్ మల్లికార్జున్, చికెన్ షాపు, నిర్వాహకుడు(కొమురవెల్లి)