జహీరాబాద్, ఏప్రిల్ 19 : వ్యవసాయ భూములకు సాగునీరు సరఫరా చేసేందుకు రూ. 3 వేల కోట్లతో సంగమేశ్వర ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేసి లక్ష ఎకరాలకు సాగు నీరు సరఫరా చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు అన్నారు. మంగళవారం జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో సైకిల్‌యాత్ర చేసి, ప్రజా సమస్యలు తెలుసుకొని, ముస్లిం షాదీఖాన వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గోదావరి నీటిని కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా సింగూరు ప్రాజెక్టులో నింపి, అక్కడి నుంచి జహీరాబాద్ నియోజకవర్గంలో ఉన్న వ్యవసాయ భూములకు సాగు నీరు సరఫరా చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే మొగుడంపల్లి మండలం 650 మీటర్లు ఎత్తులో ఉందని, అక్కడికి గోదావరి నీళ్లు అందించనున్నామన్నారు.
గత శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా మాణిక్‌రావును గెలిపిస్తే నియోజకవర్గంలోని లక్ష ఎకరాలకు గోదావరి నీరు సరఫరా చేసేందుకు కృషి చేస్తామని, సీఎం కేసీఆర్ మాటా ఇచ్చి ఇప్పడు అమలు చేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ జహీరాబాద్ పట్టణ అభివృద్ధికి రూ. 50 కోట్లు మంజూరు చేశారన్నారు. సీఎం కేసీఆర్ నిధులు మంజూరు చేయడంతో ఏ వార్డుల్లో ఏ సమస్య ఉందో గుర్తించి పనులు చేసేందుకు వివిధ శాఖల ఇంజినీరింగ్ అధికారులతో కలిసి సైకిల్ యాత్ర చేశామన్నారు. గతంలో జహీరాబాద్ మున్సిపల్లో పాదయాత్ర చేసి రూ. 25 కోట్లు మంజారు చేశామన్నారు. నిధులు మంజూరు చేసి ప్రధాన రోడ్డును నాలుగులేన్లుగా నిర్మాణం చేసి, రంజోల్ నుంచి, జహీరాబాద్ పట్టణలో రైల్వే గేటు వరకు పనులు చేశామన్నారు.
రోడ్డు మధ్య డివైడర్లు నిర్మాణం చేసి విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశామని, పట్టణంలో రూ. 6 కోట్లతో సమీకృత కూరగాయల మార్కెట్ నిర్మాణం చేస్తున్నామన్నారు. త్వరలో పనులు పూర్తి చేసి ప్రారంభించేందుకు ఆదేశాలు ఇచ్చామన్నారు. పట్టణంలోని కొన్ని వార్డుల్లో రోడ్లు లేవు, త్వరలో అక్కడ రూ. 15 కోట్లతో బీటీ రోడ్లు నిర్మాణాలను ప్రారంభిస్తామన్నారు. కొన్ని కాలనీల్లో మురుగు కాల్వలు, సీసీ రోడ్లు లేవు, అక్కడ పనులు చేసేందుకు అధిక ప్రాధాన్యతనిస్తామని తెలిపారు.
గీతారెడ్డి మంత్రిగా ఉండి కూడా..
జహీరాబాద్ నియోజకవర్గం నుంచి గీతారెడ్డి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందినా.. ఒక్క సారి కూడా పట్టణంలో పర్యటన చేయలేదని, అభివృద్ధి కోసం పట్టించుకోలేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయంలోనే జహీరాబాద్ మున్సిపల్ అభివృద్ధి సాధించిందన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నా..ప్రజా సమస్యలు పరిష్కారం చేయలేదన్నారు.
మురుగు కాల్వలు ఆక్రమించిన వారిపై చర్యలు
జహీరాబాద్ మున్సిపల్ పరిధిలో కొందరు రియల్ వ్యాపారులు మురుగు కాల్వలు ఆక్రమించారని ఫిర్యాదు వచ్చిందని, విచారణ చేసి చర్యలు తీసుకునేందుకు అడిషనల్ కలెక్టర్ రాజార్షిషాకు ఆదేశాలు ఇచ్చామన్నారు. వర్షాకాలంలో మురుగు కాల్వలో నీరు నిల్వ ఉండకుండా కాల్వర్టుల వద్ద ఉన్న చెత్తను తొలిగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కొన్ని కాల్వర్టులు కూలీ పోవడం జరిగిందని, వాటికి మరమ్మతలు చేసేందుకు నిధులు మంజూరు చేస్తామన్నారు. జహీరాబాద్ పట్టణంలో ఆక్రమణకు గురైన కాల్వలు గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
అర్బన్ పార్కు నిర్మాణానికి రూ. కోటి
జహీరాబాద్ పట్టణ సమీపంలో మహీంద్రా ఆండ్ మహీంద్ర పరిశ్రమ పక్కన జాతీయ రహదారి వెంట రూ. 3 కోట్లుతో అర్బన్ పార్కు నిర్మాణం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గతంలో అర్బన్ పార్కు నిర్మాణానికి ప్రభుత్వం రూ. 2 కోట్లు మంజూరు చేసిందని, నిధుల కొరత ఏర్పడి పనులు మధ్యలో నిలిచిపోయాయని డీఎఫ్‌వో తెలుపడంతో అదనంగా మహీంద్ర పరిశ్రమ సీఎస్ఆర్ కింద రూ. కోటి మంజూరు చేసేందుకు ముందుకు వచ్చిందన్నారు. అర్బన్ పార్కు పనులు పూర్తి చేస్తే జహీరాబాద్ పట్టణ ప్రజలకు ఎంతో మేలు కలుగుతుందన్నారు. ఉదయం, సాయంత్రం వాకింగ్ చేసేందుకు ఉపయోగపడుతుందన్నారు. చిన్న పిల్లలు ఆడుకోనేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు ఇచ్చామన్నారు.
పారిశ్రామిక ప్రాంతంగా జహీరాబాద్ అభివృద్ధి
నిమ్జ్‌కు పర్యావరణ అనుమతులు రావడంతో పెద్ద పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. నిమ్జ్‌లో డిఫెన్స్ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ఆగ్రిమెంట్ చేసుకోవడం జరిగిందని, మహీంద్రా అండ్ మహీంద్ర లాంటి భారీ పరిశ్రమలు నిమ్జ్‌లో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయని తెలిపారు. త్వరలో నిమ్జ్‌లో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు భూమి పూజ చేస్తామన్నారు. జహీరాబాద్ ప్రాంతానికి గోదావరి నీరు, నిమ్జ్ రావడంతో ఎంతో అభివృద్ధి సాధిస్తుందన్నారు. స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమలకు ప్రభుత్వం రాయితీ కలిపిస్తుందన్నారు.
ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు సైకిల్ యాత్ర
జహీరాబాద్ మున్సిపల్ పరిధిలో ఉన్న వార్డుల్లో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు మంత్రి హరీశ్‌రావు సైకిల్‌యాత్ర నిర్వహించారు. మంగళవారం ఉదయం న్యాల్కల్ మండలంలోని రేజింతల్ సిద్ధివినాయక దేవాలయంలో పూజలు చేసి, జహీరాబాద్ మున్సిపల్లో సైకిల్ యాత్ర ప్రారంభించారు. రాంనగర్, హమలీ కాలనీ, డ్రైవర్ కాలనీ గాంధీ నగర్, గడి, మాణిక్ ప్రభు విధి, ఖసాబ్ గాలీ వరకు సైకిల్‌యాత్ర నిర్వహించారు. గడిలోని ఎస్సీ కాలనీ ప్రక్కన ఉన్న మురుగు నీటి కాల్వను రియల్ వ్యాపారులు అక్రమించడంతో మురుగు వెళ్లడం లేదని కాలనీ వాసులు మంత్రికి ఫిర్యాదు చేశారు. రాంనగర్, ఏరియాలో ఉన్న పలు కాలనీల్లో సీసీ రోడ్లు, మురుగు కాల్వలు నిర్మాణం చేసేందుకు ప్రతిపాదలు సిద్ధం చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు ఆదేశాలిచ్చారు. జహీరాబాద్ మాజీ ఎమ్మెల్యే బాగన్నకు ప్రభుత్వం ఇంటిని నిర్మాణం చేయడంతో అక్కడికి వెళ్లి వారి కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. బాగన్న కుటుంబానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మౌలిక సదుపాయల కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ ఎం. శివకుమార్, ఆడిషనల్ కలెక్టర్లు రాజార్షిషా, వీరారెడ్డి, ఆర్డీవో రమేశ్‌బాబు, డీఎస్పీ శంకర్రాజు, తహసీల్దార్ నాగేశ్వర్రావు, మున్సిపల్ కమిషనర్ సుభాష్‌రావు, రైల్వే బోర్డు సభ్యులు ఫరీద్, జహీరాబాద్ పట్టణ,మండలాధ్యక్షులు సయ్యద్ మోహినొద్దీన్, ఎంజీ. రాములు, మాజీ కౌన్సిలర్ నామ రవికిరణ్, రాము లు నేత, మోతిరాం, అధికారులు పాల్గొన్నారు.
ముస్లిం షాదీఖానకు రూ. 1.50 కోట్లు
జహీరాబాద్ పట్టణంలో ముస్లింల షాదీఖాన నిర్మాణానికి రూ. 1.50 కోట్లు మంజూరు చేస్తున్నామన్నారు. షాదీఖాన నిర్మాణం చేయడంతో ఎంతో మంది పేదలకు మేలు కలుగుతుందన్నారు. ముస్లిం షాదీఖానతో పాటు యాదవ్, ముదిరాజ్, అంబేద్కర్ భవనాలు నిర్మాణాలు చేసేందుకు ఒక్కొక్క భవనానికి రూ. కోటి చొప్పున నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. అన్ని వర్గాలకు ప్రాధన్యత కలిపించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు.
రూ. 19 కోట్లతో జహీరాబాద్‌లో మిషన్ భగీరథ పనులు
జహీరాబాద్ పట్టణంలో ఉన్న ప్రతి ఇంటికీ తాగునీరు సరఫరా చేసేందుకు రూ.19 కోట్లతో మిషన్ భగరీథ పనులు వేగవంతంగా సాగుతున్నాయన్నారు. ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. జహీరాబాద్ పట్టణంలో అర్హులైన వారికి డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. సొంత స్థలం ఉన్న వారు ఇల్ల్లు నిర్మాణం చేసుకోనేందుకు రూ. 3 లక్షలు మంజూరు చేస్తున్నారన్నారు. జహీరాబాద్ పట్టణంలో రైల్వే బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలని ఆర్అండ్బీ ఇంజీనీరింగ్ అధికారులకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. జహీరాబాద్‌లో రూ.60 కోట్లతో బాలికలు, బాలుర మైనార్టీ గురుకుల పాఠశాలల భవనాలు నిర్మాణాలు చేశామన్నారు. త్వరలో మైనార్టీ గురుకుల భవనాలు ప్రారంభిస్తామని తెలిపారు. జహీరాబాద్ పట్టణంలో హిందూ, ముస్లిం, క్రైస్తవులకు వైకుంఠ రథాలు మంజూరు చేశామన్నారు.
పేద విద్యార్థికి మంత్రి చేయూత
మెడిసన్ సీటు కోసం మంచి ర్యాంకు సాధించిన ఓ పేద విద్యార్థికి మంత్రి హరీశ్‌రావు చేయూతనందించారు. నారాయణఖేడ్ మండలం పలుగు తండాకు చెందిన కేతావత్ రామ్‌పాల్ డాక్టర్ కావాలనే ఆకాంక్ష మేరకు మెడిసిన్ సీటు కోసం రాసిన నీట్ పరీక్షలో రామ్‌పాల్‌కు 3,269 ర్యాంక్ రావడంతో ప్రభుత్వపరంగా ఉచితంగా ప్రవేశం లభించింది. అయితే స్టడీ మెటీరియల్‌తో పాటు హాస్టల్ సదుపాయం పొందేందుకు కూడా రామ్‌పాల్‌కు స్థోమత లేకపోవడంతో ఈ విషయాన్ని తెలుసుకున్న మంత్రి హరీశ్‌రావు, మెడిసిన్ కోర్సు పూర్తయ్యే వరకు రామ్‌పాల్‌కు ఉచితంగా హాస్టల్ వసతి ఏర్పాటు చేయడమే కాకుండా స్టడీ మెటీరియల్ అందజేయాల్సిందిగా ఉన్నతాధికారులకు సూచించారు. దీంతో రామ్‌పాల్ ఆనందం వ్యక్తం చేస్తూ మంత్రి హరీశ్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు.